Ragi Burelu : రాగి బూరెలు.. రాగి పిండితో చేసే ఈ బూరెలు చాలా రుచిగా ఉంటాయి. రాగులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. వీటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. రాగులతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. వాటిలో రాగి బూరెలు కూడా ఒకటి. ఈ బూరెలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే ఈ బూరెలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి బూరెల తయారీకి కావల్సిన పదార్థాలు..
నువ్వులు – 2 టేబుల్ స్పూన్స్, ఎండు కొబ్బరి పొడి – 2 టేబుల్ స్పూన్స్, బెల్లం తురుము – ఒక కప్పు, నీళ్లు – ఒక కప్పు, రాగిపిండి – 2 కప్పులు, యాలకుల పొడి – ఒక టీ స్పూన్, ఉప్పు – చిటికెడు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
రాగి బూరెల తయారీ విధానం..
ముందుగా గిన్నెలో బెల్లం, నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి దానిని వడకట్టి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నువ్వులు వేసి వేయించాలి. నువ్వులు వేగిన తరువాత ఎండు కొబ్బరి పొడి కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులోనే రాగిపిండి, యాలకుల పొడి, ఉప్పు వేసి కలపాలి. తరువాత ముందుగా సిద్దం చేసుకున్న బెల్లం పాకాన్ని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. పిండిని చపాతీ పిండిలా కలుపుకున్న తరువాత చేతికి తడి చేసుకుంటూ ఉండలుగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె మధ్యస్థంగా వేడయ్యాక ఒక్కో ఉండను తీసుకుంటూ ప్లాస్టిక్ కవర్ మీద లేదా బటర్ పేపర్ మీద బూరెల్లా వత్తుకుని నూనెలో వేసుకోవాలి.
బూరెలు మరీ పలుచగా మరీ మందంగా ఉండకుండా చూసుకోవాలి. తరువాత వీటిని అటూ ఇటూ తిప్పుతూ ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రాగి బూరెలు తయారవుతాయి. వీటిని తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ బూరెలు రెండు నుండి మూడు రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి. తీపి తినాలనిపించినప్పుడు రుచిగా అలాగే ఆరోగ్యానికి మేలు చేసేలా రాగిపిండితో బూరెలను తయారు చేసుకుని తినవచ్చు.