Ragi Dosa : రాగులను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందన్న సంగతి మనుకు తెలిసిందే. వీటిలో పోషకాలు మనకు చక్కటి ఆరోగ్యాన్ని అందించడంలో సహాయపడతాయి. రాగులతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. రాగులతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో రాగి దోశ కూడా ఒకటి. రాగి దోశను తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. రాగి దోశను క్రిస్పీగా, రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
రాగులు – 2 కప్పులు, మినపప్పు – ఒక కప్పు, మెంతులు – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత.
రాగి దోశ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో రాగులను తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి 8 గంటల పాటు నానబెట్టాలి. అలాగే మరో గిన్నెలో మినపప్పు, మెంతులు వేసి శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి నానబెట్టాలి. ఇలా 8 గంటల పాటు నానబెట్టిన తరువాత వీటిని గ్రైండర్ లో వేసి మెత్తగా పిండిని రుబ్బుకోవాలి. తరువాత ఈ పిండిలో ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి దోశ పిండిలా కలుపుకోవాలి. ఈ పిండి పులియాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి.
పెనం వేడయ్యాక నూనె వేసి టిష్యూతో లేదా ఉల్లిపాయతో రుద్దాలి. తరువాత తగినంత పిండిని తీసుకుని వీలైనంత పలుచటి దోశలా వేసుకోవాలి. తరువాత దీనిపై నూనె వేసి ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రాగి దోశ తయారవుతుంది. దీనిని అల్లం చట్నీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. షుగర్ వ్యాధి గ్రస్తులు ఇలా రాగులతో దోశలను వేసుకుని తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.