Ragi Oats Laddu : మనం రాగిపిండితో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. రాగిపిండితో జావ, సంగటి, రొట్టె ఇలా రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. రాగిపిండితో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు ఇవి మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. రాగిపిండితో తరచూ చేసే వంటకాలే కాకుండా దీనితో మనం ఎంతో రుచిగా ఉండే లడ్డూలను కూడా తయారు చేసుకోవచ్చు. రాగిపిండి, ఓట్స్ కలిపి చేసే ఈ లడ్డూలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల రాగులు, ఓట్స్ వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు. ఈ లడ్డూలను పది నిమిషాల్లో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ రాగి ఓట్స్ లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి ఓట్స్ లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఓట్స్ – అర కప్పు, నెయ్యి -అర కప్పు, జీడిపప్పు – కొద్దిగా, రాగిపిండి – ఒక కప్పు, బెల్లం తురుము – ఒక కప్పు.
రాగి ఓట్స్ లడ్డూ తయారీ విధానం..
ముందుగా కళాయిలో ఓట్స్ ను వేసి దోరగా వేయించాలి. తరువాత ఈ ఓట్స్ ను జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక జీడిపప్పును వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే నెయ్యిలో రాగిపిండి వేసి వేయించాలి. ఈ పిండిని కలుపుతూ పచ్చి వాసన పోయచే వరకు వేయించిన తరువాత మిక్సీ పట్టుకున్న ఓట్స్ పొడి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని 3 నుండి 4 నిమిషాల పాటు వేయించిన తరువాత బెల్లం తురుము వేసి కలపాలి.
బెల్లం తురుము కొద్దిగా మెత్తబడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత ఇందులో వేయించిన జీడిపప్పు వేసి అంతా కలిసేలా చేత్తో బాగా కలపాలి. తరువాత చేతులకు నెయ్యి రాసుకుంటూ కొద్ది కొద్దిగా రాగిపిండిని తీసుకుంటూ లడ్డూలుగా చుట్టూకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రాగి ఓట్స్ లడ్డూలు తయారవుతాయి. ఈ లడ్డూలను తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. పిల్లలకు ఈ లడ్డూలను ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది.