Hotel Style Allam Pachadi : వంటల రుచిని పెంచడంతో పాటు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఆహార పదార్థాల్లో అల్లం కూడా ఒకటి. అల్లం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అల్లాన్ని వాడడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. వంటల్లో వాడడంతో పాటు అల్లంంతో మనం ఎంతో రుచిగా ఉండే అల్లం పచ్చడిని కూడా తయారు చేస్తూ ఉంటాము. అల్లం పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. హోటల్స్ లో కూడా మనకు అల్లం పచ్చడిని అల్పాహారాలతో సర్వ్ చేస్తూ ఉంటారు. అల్లం పచ్చడిని మనం చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. చూస్తేనే నోట్లో నీళ్లు ఊరే ఈ అల్లం పచ్చడిని హోటల్ స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లం పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 5 టేబుల్ స్పూన్స్, తరిగిన అల్లం – పావు కప్పు, శనగపప్పు – పావు కప్పు, ధనియాలు – పావు కప్పు, మినపప్పు – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 20, ఉప్పు- తగినంత, చింతపండు – పావు కప్పు, బెల్లం తురుము – పావు కప్పు.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – పావు కప్పు, ఆవాలు – 2 టీ స్పూన్స్, కరివేపాకు -ఒక రెమ్మ, ఇంగువ – పావు టీ స్పూన్.
అల్లం పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అల్లం ముక్కలు వేసి వేయించాలి. తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు అదే కళాయిలో శనగపప్పు, ధనియాలు, మినపప్పు, జీలకర్ర వేసి వేయించాలి. ఇవి దోరగా వేగిన తరువాత ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉప్పు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి చల్లారిన తరువాత ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే బెల్లం, చింతపండు , వేయించిన అల్లం వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో తాళింపుకు నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఇంగువ వేసి కలపాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే అల్లం పచ్చడి తయారవుతుంది. దీనిని అన్నం, అల్పాహారాలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.