Ravva Bobbatlu : మనం తరుచూ చేసే తీపి వంటకాల్లో బొబ్బట్లు కూడా ఒకటి. బొబ్బట్లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అలాగే మనం మన రుచికి తగినట్టు వివిధ రుచుల్లో ఈ బొబ్బట్లను తయారు చేసి తీసుకుంటూ ఉంటాము. మనం సులభంగా చేసుకోదగిన వివిధ రకాల వెరైటీ బొబ్బట్లల్లో రవ్వ బొబ్బట్లు కూడా ఒకటి. రవ్వ స్టఫింగ్ తో చేసే ఈ బొబ్బట్లు కూడా చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. అప్పటికప్పుడు ఈ బొబ్బట్లను తయారు చేసి తీసుకోవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ రవ్వ బొబ్బట్లను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రవ్వ బొబ్బట్ల తయారీకి కావల్సిన పదార్థాలు…
గోధుమపిండి – 2 కప్పులు, ఉప్పు – చిటికెడు, పసుపు – పావు టీ స్పూన్, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, నీళ్లు – 3 కప్పులు, బెల్లం తురుము – ఒక కప్పు, పంచదార – అర కప్పు, కుంకుమ పువ్వు – చిటికెడు, బొంబాయి రవ్వ – ఒక కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్.
రవ్వ బొబ్బట్ల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలోగోధుమపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, పసుపు, నెయ్యి వేసి కలపాలి. తరువాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి కంటే మెత్తగా కలుపుకోవాలి. తరువాత మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి 5 నుండి 8 నిమిషాల పాటు బాగా కలుపుకుని మూత పెట్టి అరగంట పాటు పక్కకు ఉంచాలి. తరువాత గిన్నెలో పంచదార, బెల్లం, నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోనే కుంకుమ పువ్వు కూడా వేసి బెల్లం, పంచదార కరిగే వరకు వేడి చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కళాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత రవ్వ వేసి వేయించాలి. రవ్వ వేగిన తరువాత ముందుగా సిద్దం చేసుకున్న బెల్లం నీటిని పోసి బాగా కలపాలి. ఇందులోనే యాలకుల పొడి వేసి దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించాలి. రవ్వ మిశ్రమం దగ్గర పడి కళాయికి అంటుకోకుండా దగ్గర పడే వరకు ఉడికించిన తరువాత మరో 2 టీ స్పూన్ల నెయ్యి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత ముందుగా కలిపిన పిండిని తీసుకుని మరోసారి బాగా కలపాలి.
తరువాత గోధుమపిండిని తీసుకుని ముందుగా వెడల్పుగా వత్తుకోవాలి. తరువాత ఇందులో రవ్వ మిశ్రమాన్ని ఉంచి అంచులను మూసివేయాలి. తరువాత బటర్ పేపర్ ను లేదా మందంగా ఉండే పాలిథిన్ కవర్ ను తీసుకుని దానిపై నెయ్యి వేయాలి. తరువాత దానిపై గోధుమపిండి, రవ్వ ఉండను ఉంచి మరికొద్దిగా నెయ్యి వేసుకోవాలి. దీనిపై మరో బటర్ పేపర్ ను ఉంచి చేత్తో పలుచని బొబ్బట్లుగా వత్తుకోవాలి. తరువాత ఈ బొబ్బట్టును వేడి వేడి పెనం మీద వేసి ముందుగా రెండు వైపులా కాల్చుకోవాలి. తరువాత నెయ్యి వేసి కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రవ్వ బొబ్బట్లు తయారవుతాయి. ఈ బొబ్బట్లను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. తీపి తినాలనిపించినప్పుడు ఇలా అప్పటికప్పుడు బొబ్బట్లను తయారు చేసి తీసుకోవచ్చు.