Ravva Vadiyalu : మనం కూరలు, పప్పు వంటి వాటిల్లోకి సైడ్ డిష్ గా తినడానికి రకరకాల వడియాలను తయారు చేస్తూ ఉంటాము. మనం సులభంగా చేసుకోదగిన వడియాలల్లో రవ్వ వడియాలు కూడా ఒకటి. రవ్వ వడియాలు కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. రవ్వ వడియాలను తయారు చేయడానికి ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం కూడా లేదు. చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా ఈ వడియాలను తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ రవ్వ వడియాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రవ్వ వడియాల తయారీకి కావల్సిన పదార్థాలు..
నీళ్లు – 7 కప్పులు, రవ్వ – ఒక కప్పు, జీలకర్ర – ఒక టీ స్పూన్, వాము – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత.
రవ్వ వడియాల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో నీటిని తీసుకోవాలి. తరువాత ఇందులో జీలకర్ర, వాము, ఉప్పు వేసి నీటిని వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక రవ్వ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. దీనిని కొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఒక కాటన్ వస్త్రంపై ఈ రవ్వ మిశ్రమాన్ని వడియాలుగా పెట్టుకోవాలి. తరువాత వీటిని ఎండలో ఎండబెట్టాలి. వడియాలు ఎండబెట్టిన తరువాత కాటన్ వస్త్రాన్ని వెనకకు తిప్పి నీటిని చల్లుకుంటూ నెమ్మదిగా వడియాలను తీసుకోవాలి.
తరువాత ఈ వడియాలను మరో రెండు రోజుల పాటు చక్కగా ఎండబెట్టి గాలి తగలకుండా నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రవ్వ వడియాలు తయారవుతాయి. ఈ వడియాలను గాలి, తడి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల సంవత్సరం పాటు పాడవకుండా ఉంటాయి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె బాగా వేడయ్యాక వడియాలను ఒక్కొక్కటిగా వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. వీటిని పప్పు, సాంబార్ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు.