Royyala Pulusu : మనం రొయ్యలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. రొయ్యలతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. రొయ్యలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో రొయ్యల పులుసు కూడా ఒకటి. ఒక్కసారి కింద చెప్పిన విధంగా చేసిన ఈ పులుసును తింటే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. అంత రుచిగా మనం రొయ్యల పులుసును తయారు చేసుకోవచ్చు. చూస్తూ ఉంటేనే నోట్లో నీళ్లు ఊరేలా కమ్మగా ఉండే ఈ రొయ్యల పులుసును సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రొయ్యల కారం పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
శుభ్రం చేసిన రొయ్యలు – అరకిలో, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – అర టీ స్పూన్, నానబెట్టిన చింతపండు – పెద్ద నిమ్మకాయంత, తరిగిన టమాట – 1, తరిగిన ఉల్లిపాయ – 1, నూనె – 3 టేబుల్ స్పూన్, మెంతులు – చిటికెడు, దాల్చినచెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 3, యాలకులు – 2, బిర్యానీ ఆకు – 1, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, నీళ్లు – ఒక గ్లాస్, గరం మసాలా – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
రొయ్యల కారం పులుసు తయారీ విధానం..
ముందుగా రొయ్యల్లో ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి శుభ్రంగా కడగాలి. తరువాత ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి పక్కకు ఉంచాలి. అలాగే చింతపండు నుండి రసాన్ని తీసుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత మసాలా దినుసులు, మెంతులు వేసి వేయించాలి. తరువాత ఆవాలు, జీలకర్ర కూడా వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ముందుగా సిద్దం చేసుకున్న రొయ్యలు, టమాట ముక్కలు వేసి కలపాలి. రొయ్యల్లో ఉండే నీరంతా పోయి నూనె తేలే వరకు వేయించాలి. తరువాత మరో రెండు టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, ధనియాల పొడి వేసి కలపాలి.
వీటిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత చింతపండు రసం, నీళ్లు పోసి కలపాలి. తరువాత తగినంత ఉప్పు, మరో రెమ్మ కరివేపాకు వేసి కలపాలి. ఇప్పుడు ఈ పులుసును రొయ్యలు మెత్తబడి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత గరం మసాలా, కొత్తిమీర చల్లుకుని కలుపుకోవాలి. దీనిని మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రొయ్యల పులుసు తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. రొయ్యలతో ఈ విధంగా చేసిన పులుసును లొట్టలేసుకుంటూ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.