Sabudana Kichdi : మనం సగ్గుబియ్యాన్ని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. సగ్గుబియ్యం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటితో మనం అనేక రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. సగ్గుబియ్యంతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో సగ్గుబియ్యం కిచిడీ కూడా ఒకటి. సగ్గుబియ్యం కిచిడీ చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంగా తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. వేసవికాలంలో దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. దీనిని చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ సగ్గుబియ్యం కిచిడీని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సగ్గుబియ్యం కిచిడీ తయారీకి కావల్సిన పదార్థాలు..
సగ్గుబియ్యం- ఒక కప్పు, ఉడికించిన బంగాళాదుంపలు – 2( చిన్నవి), పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, పంచదార- ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నిమ్మరసం – 2 టీ స్పూన్స్.
సగ్గుబియ్యం కిచిడీ తయారీ విధానం..
ముందుగా సగ్గుబియ్యాన్ని గిన్నెలో తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత ఒక కప్పు నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. తరువాత కళాయిలో పల్లీలు వేసి వేయించాలి. తరువాత వీటిపై ఉండే పొట్టును తీసేసి జార్ లో వేసి బరకగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత జీలకర్ర వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ఉప్పు, పంచదార వేసి కలపాలి. తరువాత బంగాళాదుంప ముక్కలు వేసి వేయించాలి. వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత నానబెట్టిన సగ్గుబియ్యం, మిక్సీ పట్టుకున్న పల్లీలు వేసి కలపాలి. వీటిని మూడు నిమిషాల పాటు బాగా కలుపుతూ వేయించిన తరువాత కొత్తిమీర, నిమ్మరసం వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సగ్గుబియ్యం కిచిడీ తయారవుతుంది. దీనిని తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.