Sada Pulusu : మనం వంటింట్లో పులుసు కూరలను కూడా తయారు చేస్తూ ఉంటాము. పులుసు కూరలు చాలా రుచిగా ఉంటాయి. మనం వివిధ రకాల కూరగాయలతో , కోడిగుడ్లతో ఈ పులుసు కూరలను తయారు చేస్తూ ఉంటాము. అయితే ఎటువంటి కూరగాయలు ఉపయోగించకుండా మనం సాదా పులుసును తయారు చేసుకోవచ్చు. ఈ పులుసును తయారు చేయడం చాలా తేలిక. బ్యాచిలర్స్ కూడా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. వంట చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు, ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈ పులుసును తయారు చేసుకోవచ్చు. ఎంతో కమ్మగా ఉండే ఈ సాదా పులుసును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
చింతపండు – పెద్ద నిమ్మకాయంత, పెద్ద ముక్కలుగా తరిగిన ఉల్లిపాయ – 1, పెద్ద ముక్కలుగా తరిగిన టమాట – 1, నూనె – 4 టేబుల్ స్పూన్, మెంతులు – చిటికెడు, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 7, కరివేపాకు -ఒక రెమ్మ, పసుపు – అర టీ స్పూన్, కారం – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, నీళ్లు – ఒకటిన్నర గ్లాస్ లేదా తగినన్ని, ధనియాల పొడి – అర టీ స్పూన్.
పులుసు తయారీ విధానం..
ముందుగా చింతపండు నుండి రసాన్ని తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి వేయించాలి. వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత ఉప్పు, కారం, పసుపు వేసి కలపాలి. తరువాత చింతపండు రసం, నీళ్లు పోసి కలపాలి. తరువాత ధనియాల పులుసు వేసి కలపాలి.
ఇప్పుడు మూత పెట్టి మధ్యస్థ మంటపై పులుసును ఉడికించాలి. దీనిని నూనె పైకి తేలే వరకు ఉడికించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పులుసు తయారవుతుంది. ఈ పులుసు చల్లారే కొద్ది మరింత దగ్గర పడుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పులుసులో మునక్కాయ ముక్కలను వేసుకోవచ్చు. అలాగే ఉడికించిన కోడిగుడ్లను కూడా వేసుకుని తినవచ్చు. ఈ విధంగా తయారు చేసిన పులుపుసు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.