Saggubiyyam Halwa : మనం సగ్గుబియ్యాన్ని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఇతర ఆహార పదార్థాల వలె సగ్గుబియ్యం మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సగ్గుబియ్యంతో మనం ఎక్కువగా పాయసం తయారు చేస్తూ ఉంటాం. అలాగే రకరకాల చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా మనం సగ్గుబియ్యంతో హల్వాను కూడా తయారు చేసుకోవచ్చు. సగ్గుబియ్యంతో చేసే ఈ హల్వా చాలా రుచిగా ఉంటుంది. నానబెట్టిన సగ్గుబియ్యం ఉండాలే కానీ ఈ హల్వాను మనం కేవలం పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా తేలిక. ఎంతో రుచిగా ఉండే సగ్గుబియ్యం హల్వాను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సగ్గుబియ్యం హల్వా తయారీకి కావల్సిన పదార్థాలు..
సగ్గుబియ్యం – ఒక టీ గ్లాస్, పాలు – 3 టీ గ్లాసులు, పంచదార – ఒక టీ గ్లాస్, దంచిన యాలకులు – 4, డ్రై ఫ్రూట్స్ – కొద్దిగా, నెయ్యి – 2 టీ స్పూన్స్.
సగ్గుబియ్యం హల్వా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి 2 గంటల పాటు నానబెట్టాలి. తరువాత వాటిని వడకట్టుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు గిన్నెలో పాలు పోసి వేడి చేయాలి. పాలు వేడయ్యాక సగ్గుబియ్యం వేసి ఉడికించాలి. వీటిని కలుపుతూ దగ్గర పడే వరకు ఉడికించిన తరువాత పంచదార, యాలకులు వేసి కలపాలి. పంచదార కరిగి దగ్గర పడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసి వేయించాలి. డ్రై ఫ్రూట్స్ వేగిన తరువాత వాటిని ముందుగా తయారు చేసుకున్న హల్వాలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సగ్గుబియ్యం హల్వా తయారవుతుంది. తీపి తినాలనిపించినప్పుడు లేదా పండుగలకు సగ్గుబియ్యంతో పాయసమే కాకుండా ఇలా హల్వాను కూడా తయారు చేసుకుని తినవచ్చు. దీనిని లొట్టలేసుకుంటూ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.