Iron Deficiency : మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మనం రోజూ అన్ని పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. పోషకాలు ఏవి తక్కువ అయినా సరే మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ క్రమంలోనే శరీరం పలు లక్షణాలను సూచిస్తుంటుంది. అలాగే కొన్ని రోగాలు కూడా వస్తుంటాయి. అయితే మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన పోషకాల్లో ఒకటి అయిన ఐరన్ లోపిస్తే మాత్రం పలు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిల్లో ఒకటి శ్వాస సరిగ్గా ఆడకపోవడం.. అలాగే ఎల్లప్పుడూ వికారంగా ఉండడం. ఈ లక్షణాలు రెండూ ఎవరిలో అయినా ఉంటే.. వారిలో ఐరన్ లోపం ఉందని అర్థం చేసుకోవాలి.
ఇక ఐరన్ లోపం ఉంటే పైన తెలిపిన రెండు లక్షణాలు మాత్రమే కాకుండా ఇంకా పలు అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. ముఖ్యంగా తీవ్రమైన తలనొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, నోట్లో పూత వచ్చి వాపులు కనిపించడం, కాళ్లకు విశ్రాంతి లేనట్లు అనిపించడం, డిప్రెషన్, చర్మం తెల్లగా మారిపోవడం, ఆకలి లేకపోవడం.. వంటివన్నీ ఐరన్ లోపం ఉందని చెప్పేందుకు తగిన కారణాలు అని చెప్పవచ్చు. అయితే ఐరన్ లోపం ఉంటే దాన్నుంచి సులభంగానే బయట పడవచ్చు. అందుకు గాను డాక్టర్ సూచించిన మందులను వాడాల్సి ఉంటుంది. అలాగే ఐరన్ ఉండే ఆహారాలను తరచూ తినాలి. దీంతో ఐరన్ లోపం నుంచి బయట పడవచ్చు.
ఐరన్ లోపం నుంచి బయట పడాలంటే ఎక్కువగా ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలను తినాల్సి ఉంటుంది. ముఖ్యంగా పాలకూర, చుక్క కూర, గోంగూర, తోటకూర, బచ్చలి కూర వంటి ఆకుకూరలతోపాటు క్యాబేజీ, కాలిఫ్లవర్, ముల్లంగి, బీట్‌రూట్, టమాటా వంటి కూరగాయలను కూడా తినాలి. అలాగే రోజుకో యాపిల్ పండును, బొప్పాయి, దానిమ్మ, నల్ల ద్రాక్ష వంటి పండ్లను తింటున్నా కూడా ఐరన్ లోపం నుంచి బయట పడవచ్చు. అలాగే ఖర్జూరాలు, అంజీర్, కిస్‌మిస్ వంటి డ్రై ఫ్రూట్స్ ను తిన్నా కూడా ఐరన్ లోపం తగ్గుతుంది.
ఇక చిక్కుడు జాతికి చెందిన బీన్స్, చిక్కుళ్లు, అలసందలు వంటి కూరగాయలను కూడా తినవచ్చు. దీంతోపాటు రొయ్యలు, చేపలను తింటున్నా కూడా ఐరన్ లోపం తగ్గుతుంది. దీంతో రక్తం అధికంగా ఉత్పత్తి అవుతుంది. రక్తహీనత నుంచి బయట పడవచ్చు. అయితే మన శరీరం ఐరన్‌ను ఎక్కువగా గ్రహించాలంటే విటమిన్ సి ఉండే ఆహారాలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కివీ, ద్రాక్ష, నిమ్మ, నారింజ, దానిమ్మ వంటి పండ్లను తింటే విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇలా ఐరన్ లోపం సమస్యను అధిగమించవచ్చు.