Shahi Paneer Kurma : మనకు రెస్టారెంట్ లలో, ధాబాలలో లభించే పనీర్ వెరైటీలలో షాహీ పనీర్ కుర్మా కూడా ఒకటి. పనీర్ తో చేసే ఈ వంటకం చాలా రుచిగా, కమ్మగా ఉంటుంది. దీనిని ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ ఇది కావాలని అడుగుతారు. ఎంతో రుచిగా ఉండే ఈ షాహీ పనీర్ కుర్మాను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. పనీర్ ఉంటే చాలు ఈ కూరను 20 నిమిషాల్లో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ షాహీ కుర్మాను రెస్టారెంట్ స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
షాహీ పనీర్ కుర్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – అర టేబుల్ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, సాజీరా – అర టీ స్పూన్, బిర్యానీ ఆకులు – 2, లవంగాలు – 3, యాలకులు – 3, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, అనాస పువ్వు -1, మరాఠీ మొగ్గ – 1, ఉల్లిపాయలు – 2, పచ్చిమిర్చి -2, జీడిపప్పు – 10, అల్లం – ఒక ఇంచు ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 7, ఉప్పు – తగినంత, కారం -ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, టమాటాలు – 2, పెరుగు – అర కప్పు, పంచదార – పావు టీ స్పూన్, పనీర్ – 250 గ్రా., నీళ్లు – ఒక టీ గ్లాస్, పాలు – ఒక కప్పు, కసూరి మెంతి – ఒక టీ స్పూన్.
షాహీ పనీర్ కుర్మా తయారీ విధానం..
ముందుగా జార్ లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీడిపప్పు, అల్లం, వెల్లుల్లి వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లాగా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే జార్ లో టమాటాలు కూడా వేసి ఫ్యూరీలాగా చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత మసాలా దినుసులు వేసి వేయించాలి. మసాలా దినుసులు వేగిన తరువాత మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా వేసి కలపాలి.
దీనిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత టమాట ఫ్యూరీని వేసి కలపాలి. దీనిని 5 నిమిషాల పాటు వేయించిన తరువాత పంచదార, పెరుగు వేసి కలపాలి. దీనిని 2 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించిన తరువాత పనీర్ ముక్కలు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు వేయించిన తరువాత నీళ్లు, పాలు పోసి కలపాలి. దీనిని మధ్య మధ్యలో కలుపుతూ నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. తరువాత కసూరి మెంతి వేసి మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే షాహీ పనీర్ కుర్మా తయారవుతుంది. దీనిని రోటీ, చపాతీ, నాన్, బటర్ నాన్ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది.