Shanaga Pappu Chutney : మనం ఉదయం అల్పాహారాలతో తినడానికి వివిధ రకాల చట్నీలను కూడా తయారు చేస్తూ ఉంటాం. చట్నీ రుచిగా ఉంటేనే మనం అల్పాహారాలను తినడానికి వీలుగా ఉంటుంది. సాధారణంగా మనం పల్లి చట్నీ, పుట్నాల చట్నీ, కొబ్బరి చట్నీ, టమాట చట్నీ వంటి రకరకాల చట్నీలను తయారు చేస్తాం. ఇవే కాకుండా మనం శనగపప్పుతో కూడా చట్నీని తయారు చేసుకోవచ్చు. ఇతర చట్నీలలాగా శనగపప్పుతో చేసే చట్నీ కూడా చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారాలను తినడానికి ఈ చట్నీ కూడా చాలా చక్కగా ఉంటుంది. శనగపప్పుతో చట్నీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శనగపప్పు చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపప్పు – అర కప్పు, నూనె – ఒక టేబుల్ స్పూన్, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, మినప పప్పు – 2 టీ స్పూన్స్, పచ్చిమిర్చి – 8 లేదా తగినన్ని, వెల్లుల్లి రెబ్బలు – 4, చింతపండు – కొద్దిగా, కరివేపాకు – 2 రెబ్బలు, ఎండుకొబ్బరి పొడి – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినప పప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, ఎండు మిర్చి – 1, కరివేపాకు – ఒక రెబ్బ.
శనగపప్పు చట్నీ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ధనియాలను వేసి దోరగా వేయించాలి. ఇవి వేగిన తరువాత జీలకర్ర, మినప పప్పు, శనగపప్పు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత చింతపండు, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. ఇవి పూర్తిగా చల్లారిన తరువాత ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే ఉప్పు, ఎండుకొబ్బరి పొడి వేసి ముందుగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి తాళింపు చేసుకోవాలి. తాళింపు వేగిన తరువాత దానిని చట్నీలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే శనగపప్పు చట్నీ తయారవుతుంది. దీనిని మనం ఉదయం తినే అన్ని రకాల అల్పాహారాలతో కలిపి తినవచ్చు.