Shanagapappu Tomato Pappu : టమాటాలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో టమాట పప్పు కూడా ఒకటి. టమాట పప్పు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ పప్పును ఇష్టంగా తింటారు. దీనిని తరుచూ ఇంట్లో కూడా తయారు చేస్తూ ఉంటారు. అయితే సాధారణంగా టమాట పప్పును చేయడానికి మనం కందిపప్పును ఉపయోగిస్తూ ఉంటాము. ఇలా కందిపప్పుకు బదులుగా మనం శనగపప్పుతో కూడా రుచికరమైన టమాట పప్పును తయారు చేసుకోవచ్చు.శనగపప్పుతో చేసే టమాటపప్పు కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. తరుచూ కందిపప్పుతోనే కాకుండా శనగపప్పుతో రుచిగా టమాట పప్పును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
శనగపప్పు టమాట పప్పు తయారీకి కావల్సిన పదార్థాలు..
3 గంటల పాటు నానబెట్టిన శనగపప్పు – ఒక కప్పు, తరిగిన టమాటాలు – 3, పసుపు – పావు టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, నీళ్లు – ఒకటిన్నర గ్లాస్, నానబెట్టిన చింతపండు – నిమ్మకాయంత, ఉప్పు – తగినంత.
తాళింపుకు కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు- ఒక టేబుల్ స్పూన్, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, ఎండుమిర్చి – 4, తరిగిన ఉల్లిపాయ- 1, కరివేపాకు – ఒక రెమ్మ.
శనగపప్పు టమాట పప్పు తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో నానబెట్టిన శనగపప్పును తీసుకోవాలి. తరువాత ఇందులో టమాట ముక్కలు, పసుపు, కారం, నీళ్లు పోసి మూత పెట్టాలి. ఇప్పుడు ఈ పప్పును 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ ఆవిరి పోయిన తరువాత మూత తీసి పప్పును మెత్తగా చేసుకోవాలి. తరువాత ఇందులో చింతపండు రసం, తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు తాళింపుకు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత పప్పును వేసి కలపాలి. ఇందులోనే తగినంత ఉప్పు వేసి కలపాలి. ఈ పప్పును మరో 5 నిమిషాల పాటు ఉడికించి కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే శనగపప్పు టమాట పప్పు తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పప్పును తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.