Shanagapindi Burfi : శ‌న‌గ‌పిండి బ‌ర్ఫీని ఇలా చేశారంటే.. నోట్లో వేసుకోగానే క‌రిగిపోతుంది..

Shanagapindi Burfi : శ‌న‌గ‌పిండితో మ‌నం ర‌కర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. శ‌న‌గ‌పిండితో చేసే చిరుతిళ్లు కానీ, తీపి ప‌దార్థాలు కానీ చాలా రుచిగా ఉంటాయి. శ‌న‌గ‌పిండితో చేసుకోద‌గిన తీపి ప‌దార్థాల్లో శ‌న‌గ‌పిండి బ‌ర్ఫీ ఒక‌టి. దీనిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఈ బ‌ర్ఫీ నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత రుచిగా మెత్త‌గా చాలా బాగుంటుంది. ఈ బ‌ర్ఫీని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. వంట‌రాని వారు, మొద‌టిసారి చేసే వారు కూడా దీనిని చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. శ‌న‌గ‌పిండితో బ‌ర్ఫీని ఎలా త‌యారు చేసుకోవాలి… త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

శ‌న‌గ‌పిండి బ‌ర్ఫీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

శ‌న‌గ‌పిండి – ఒక క‌ప్పు, నెయ్యి – అర క‌ప్పు, పంచ‌దార – అర క‌ప్పు, నీళ్లు – పావు క‌ప్పు.

Shanagapindi Burfi recipe in telugu very sweet make in this way
Shanagapindi Burfi

శ‌న‌గ‌పిండి బ‌ర్ఫీ త‌యారీ విధానం..

ముందుగా శ‌న‌గ‌పిండిని జ‌ల్లించుకుని ప‌క్క‌కు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడ‌య్యాక శ‌న‌గపిండిని వేసి ఉండలు లేకుండా బాగా క‌లుపుకోవాలి. శ‌న‌గ‌పిండి నుండి నెయ్యి వేర‌య్యే వ‌ర‌కు దీనిని చిన్న మంట‌పై ఉడికించాలి. ఇలా ఉడికిస్తూనే మ‌రో స్ట‌వ్ మీద క‌ళాయిలో పంచ‌దార‌, నీళ్లు వేసి వేడి చేయాలి. పంచ‌దార క‌రిగి లేత తీగ‌పాకం వ‌చ్చే వ‌ర‌కు దీనిని ఉడికించాలి. శ‌న‌గ‌పిండి నుండి వేర‌వుతుండ‌గా త‌యారు చేసుకున్న పంచ‌దార మిశ్ర‌మాన్ని వేసి బాగా క‌ల‌పాలి. దీనిని మ‌రో 5 నిమిషాల పాటు ఉడికించిన త‌రువాత కొద్దిగా మిశ్ర‌మాన్ని తీసుకుని ఉండ‌లా చుట్టి చూడాలి. శ‌న‌గ‌పిండి మిశ్ర‌మం ఉండ చుట్టడానికి రాగానే స్ట‌వ్ ఆఫ్ చేయాలి.

ఒక‌వేళ ఉండ చుట్టడానికి రాక‌పోతే మ‌రికొద్ది సేపు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. స్ట‌వ్ ఆఫ్ చేయ‌గానే ఈ మిశ్ర‌మాన్ని వెంట‌నే నెయ్యి రాసిన ప్లేట్ లోకి లేదా వెడ‌ల్పుగా ఉండే గిన్నెలోకి తీసుకుని పైన స‌మానంగా చేసుకోవాలి. ఈ మిశ్ర‌మం కొద్దిగా చ‌ల్లారిన త‌రువాత కావాల్సిన ఆకారంలో గాట్లు పెట్టుకోవాలి. పూర్తిగా చ‌ల్లారిన త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని ప్లేట్ లోకి తీసుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే శ‌న‌గ‌పిండి బ‌ర్ఫీ త‌యార‌వుతుంది. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు లేదా ప్ర‌త్యేక సంద‌ర్భాల్లో శ‌న‌గ‌పిండితో ఇలా బ‌ర్ఫీని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ బ‌ర్ఫీని విడిచి పెట్ట‌కుండా ఇంకా కావాల‌ని అడిగి మ‌రీ తింటారు.

D

Recent Posts