Smart Phone Charging : స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీ అయిపోతుంది అనగానే వెంటనే మనం చార్జింగ్ పెట్టేస్తాం. కొందరు చార్జింగ్ పూర్తిగా కంప్లీట్ అయిపోయేదాకా ఉండి అప్పుడు చార్జింగ్ పెడతారు. ఇక కొందరు చార్జింగ్ పెట్టి రాత్రంతా ఫోన్లను అలాగే వదిలేస్తారు. ఇలా స్మార్ట్‌ఫోన్లను చాలా మంది రక రకాలుగా చార్జింగ్ పెడుతుంటారు. దీంతో ఏదో ఒక సమయంలో ఫోన్ బ్యాటరీ కచ్చితంగా పనిచేయడం మానేస్తుంది. లేదా కరెక్ట్‌గా పనిచేయదు. దీంతో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే అసలు ఏ ఫోన్‌కైనా చార్జింగ్ ఎలా పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎంత వరకు చార్జింగ్ పెడితే మంచిది.. వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఏ స్మార్ట్‌ఫోన్‌కు చార్జింగ్ పెట్టినా కచ్చితంగా దాంతోపాటు వచ్చిన కంపెనీ చార్జర్‌నే వాడాలి. ఒక వేళ ఆ చార్జర్ అందుబాటులో లేకపోతే దాని వోల్టేజ్‌కు సమానంగా ఉండే మరో చార్జర్‌ను వాడాలి. లేదంటే ఇబ్బందులు వస్తాయి. కంపెనీతో వచ్చిన చార్జర్ కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఏ చార్జర్‌తో పడితే దాంతో చార్జింగ్ చేయకూడదు. ఇలా చేస్తే బ్యాటరీ నాణ్యత తగ్గుతుంది. దాని లైఫ్ తక్కువ కాలం వస్తుంది. దీంతో చాలా త్వరగా బ్యాటరీ మార్చాల్సి వస్తుంది.
చాలా మంది ఫోన్లకు బ్యాక్ కేస్‌లు వేస్తుంటారు. దీని వల్ల ఫోన్లపై గీతలు పడకుండా ఉంటాయని, కింద పడ్డా అంత త్వరగా పగలవని వారు భావిస్తారు. అయితే అది కరెక్టే అయినప్పటికీ, ఫోన్‌ను చార్జింగ్ పెట్టే సమయంలో మాత్రం అలాంటి బ్యాక్ కేస్‌లను తీసేయాలి. లేదంటే ఫోన్ చార్జింగ్ పెట్టినప్పుడు వచ్చే హీట్ సరిగ్గా బయటకు పోక అది డివైస్ ప్రదర్శనపై ప్రభావం చూపుతుంది. ఇలాంటి స్థితిలో ఒక్కోసారి ఫోన్లు పేలిపోయేందుకు కూడా అవకాశం ఉంటుంది.
చాలా మంది ఫోన్లు వేగంగా చార్జింగ్ అవడం కోసం ఫాస్ట్ చార్జర్లను, కెపాసిటీ ఎక్కువగా ఉన్న చార్జర్లను వాడతారు. అయితే అలా వాడకూడదు. ఫోన్‌తో వచ్చిన కంపెనీ చార్జర్ అయితే ఏమీ కాదు, కానీ అలా కాకుండా వేరే ఫాస్ట్ చార్జర్లను వాడితే బ్యాటరీ పేలేందుకు అవకాశం ఉంటుంది. కనుక బ్యాటరీకి సరిపోయే విధంగా ఉండే చార్జర్లనే వాడాలి. రాత్రంతా ఫోన్లను చార్జింగ్ పెట్టి నిద్రిస్తారు కొందరు. అలా చేయకూడదు. ఎందుకంటే అలా చేస్తే బ్యాటరీలు పేలేందుకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు వాటి లైఫ్ కూడా తగ్గిపోతుంది.
బ్యాటరీ పవర్‌ను ఆప్టిమైజ్ చేసుకోండి అంటూ ప్లే స్టోర్‌లో మనకు చాలానే బ్యాటరీ యాప్స్ లభిస్తున్నాయి. కానీ వాటిని వాడకూడదు. ఫోన్‌లో వచ్చిన డిఫాల్ట్ బ్యాటరీ యాప్స్‌నే వాడాలి. చాలా మంది ఫోన్లను పూర్తిగా 100 శాతం చార్జింగ్ అయ్యేంత వరకు ఉంచుతారు. అయితే అలా ఉంచాల్సిన పనిలేదు. ఫోన్‌ను 80 శాతం బ్యాటరీ వరకు చార్జింగ్ చేస్తే చాలు. ఒక వేళ దూర ప్రయాణాలు ఉంటే లేదంటే ఫోన్‌ను ఎక్కువ సేపు వాడాలి అనుకుంటేనే అలా 100 శాతం చార్జింగ్ పెట్టాలి.
చాలా మంది ఏం చేస్తారంటే స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ పవర్ కొంత శాతం తగ్గిందంటే చాలు, వెంటనే చార్జింగ్ పెట్టేస్తారు. ఆ తరువాత వారు అనుకున్న చార్జింగ్ పూర్తి కాగానే ఫోన్‌ను కొంత సేపు వాడి మళ్లీ చార్జింగ్ పెడతారు. అయితే అలా చేయకూడదు. చీటికీ మాటికీ ఫోన్‌ను చార్జింగ్ పెట్టడం వల్ల బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది. ఎక్కువ రోజులు రాదు. ఫోన్‌లో బ్యాటరీ కనీసం 20 శాతం ఉంటేనే చార్జింగ్ పెట్టాలి. అంతే తప్ప కొంత తగ్గిందనే నెపంతో ఎక్కువ సార్లు చార్జింగ్ పెట్టరాదు. వోల్టేజ్ సర్జ్, షార్ట్ సర్క్యూట్, ఓవర్ కరెంట్, ఓవర్ చార్జింగ్ వంటి ఫీచర్లతో ఉన్న పవర్ బ్యాంకులను వినియోగిస్తే స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ లైఫ్ బాగుంటుంది.
స్మార్ట్‌ఫోన్లను చార్జింగ్ పెట్టినప్పుడు అస్సలు వాడరాదు. సహజంగానే ఫోన్లు చార్జింగ్ అయ్యే సమయంలో వాటి నుంచి హీట్ వస్తుంటుంది. ఇక అలాంటి స్థితిలో ఫోన్ కాల్స్ చేస్తే అప్పుడు హీట్ మరింత ఎక్కువై ఫోన్ పేలేందుకు అవకాశం ఉంటుంది. కనుక అలా చేయరాదు. ఈ సూచనలు పాటిస్తే ఫోన్ బ్యాటరీ ఎక్కువ కాలం వస్తుంది. దీంతోపాటు చార్జింగ్ కూడా సరిగ్గా అవుతుంది. అలాగే ఫోన్ వేగంగా పనిచేస్తుంది. ప్రమాదాలు జరగకుండా ఉంటాయి.