Sorakaya Payasam : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో సొరకాయ ఒకటి. సొరకాయతో ఏ వంటకమైన చాలా రుచిగా ఉంటుంది. అలాగే సొరకాయను ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. కూరలు, పచ్చళ్లే కాకుండా సొరకాయతో మనం ఎంతో రుచిగా ఉండే పాయసాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. సొరకాయతో చేసే పాయసం చాలా రుచిగా ఉంటుంది. కోవా, కండెన్స్డ్ మిల్క్ లేకపోయినప్పటికి రుచిగా మనం ఈ పాయసాన్ని తయారు చేసుకోవచ్చు. చాలా సులభంగా, ఇంట్లో ఉండే పదార్థాలతో సొరకాయ పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సొరకాయ పాయసం తయారీకి కావల్సిన పదార్థాలు..
లేత సొరకాయ – అర కిలో, నెయ్యి – 2 టీ స్పూన్స్, పాలు – ఒక లీటర్, నానబెట్టిన సగ్గు బియ్యం – పావు కప్పు, జీడిపప్పు – 6, బాదం పప్పు – 6,యాలకులు – 3, పంచదార – అర కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ – కొద్దిగా, గ్రీన్ ఫుడ్ కలర్ – చిటికెడు.
సొరకాయ పాయసం తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో బాదంపప్పు, జీడిపప్పు, యాలకులు వేసి మెత్తగా పొడిగా చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత సొరకాయ పై ఉండే పొట్టును తీసి శుభ్రంగా కడగాలి. తరువాత సొరకాయను కట్ చేసి లోపల ఉండే గింజలను, తెల్లటి భాగాన్ని తీసి వేయాలి. తరువాత సొరకాయను తురుముకోవాలి. ఇప్పుడు కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడియ్యాక సొరకాయ తురుమును వేసి పచ్చి వాసన పోయేలా 3 నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. తరువాత అర గ్లాస్ నీళ్లు పోసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి సొరకాయ తురుమును ఉడికించాలి. నీరంతా పోయి సొరకాయ ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో పాలు పోసి ఒక పొంగు వచ్చే వరకు మరిగించాలి. ఇలా మరిగించిన తరువాత పాలను కలుపుతూ మరో 4 నిమిషాల పాటు బాగా మరిగించాలి.
తరువాత ఉడికించిన సొరకాయ తురుమును వేసి కలపాలి. తరువాత సగ్గు బియ్యం వేసి కలిపి మరో 5 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న పొడి వేసి కలపాలి. దీనిని మరో 3 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించిన తరువాత పంచదార, తరిగిన డ్రై ఫ్రూట్స్, ఫుడ్ కలర్ వేసి కలపాలి. పంచదార కరిగి పాలు చిక్కబడే వరకు కలుపుతూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సొరకాయ పాయసం తయారవుతుంది. దీనిని వేడిగా లేదా చల్లగా ఎలా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. సొరకాయతో ఈ విధంగా తయారు చేసిన పాయసాన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. తీపి తినాలనిపించినప్పుడు ఇలా సొరకాయతో ఎంతో రుచిగా ఉండే పాయసాన్ని తయారు చేసుకుని తినవచ్చు.