Spicy Chicken Balls : చికెన్ తో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. కేవలం కూరలు, బిర్యానీలు, వేపుళ్లే కాకుండా చికెన్ తో మనం చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాము. చికెన్ తో చేసుకోదగిన రుచికరమైన చిరుతిళ్లల్లో స్పైసీ చికెన్ బాల్స్ కూడా ఒకటి. ఈ చికెన్ బాల్స్ చాలా రుచిగా ఉంటాయి.వీటిని నిమిషాల వ్యవధిలోనే తయారు చేసుకోవచ్చు. ఎవరైనా కూడా సులభంగా చేసుకోగలిగే ఈ రుచికరమైన స్పైసీ చికెన్ బాల్స్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
స్పైసీ చికెన్ బాల్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ కీమా – 350 గ్రా., చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, పసుపు – పావు టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత,అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, గరం మసాలా -ఒక టీ స్పూన్, బ్రెడ్ క్రంబ్స్ – 4 టీ స్పూన్స్, నూనె – ఒక టేబుల్ స్పూన్.
స్పైసీ చికెన్ బాల్స్ తయారీ విధానం..
ముందుగా చికెన్ కీమాను గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో పైన చెప్పిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనకు కావల్సిన ఆకారంలో బాల్స్ లాగా చుట్టుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసిన తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చికెన్ బాల్స్ ను వేసుకోవాలి. వీటిని వేసిన వెంటనే కదిలించకూడదు. ఒక నిమిషం తరువాత అటూ ఇటూ కదిలిస్తూ మధ్యస్థ మంటపై చక్కగా వేయించాలి. ఈ బాల్స్ చక్కగా వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి రాగానే నూనెలో నుండి తీసి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే స్పైసీ చికెన్ బాల్స్ తయారవుతాయి. వీటిని టమాట కిచప్ తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. వీకెండ్స్ లో చికెన్ తో ఇలా రుచికరమైన చికెన్ బాల్స్ ను తయారు చేసుకుని తినవచ్చు. వీటిని ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.