Sponge Idli Cake : ఇడ్లీ కేక్.. ఇడ్లీల వలె ఉండే ఈ కేక్ చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో అందరూ ఈ కేక్ ను ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. వెరైటీగా కావాలని అడిగే పిల్లలకు ఈ ఇడ్లీ కేక్ ను తయారు చేసి పెట్టవచ్చు. అలాగే ఈ కేక్ ను కేవలం 15 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. అలాగే వంటరాని వారు కూడా దీనిని తయారు చేసుకోవచ్చు. ఇంట్లో ఒవెన్ లేకపోయినా కూడా ఈ కేక్ ను మనం తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా అలాగే స్పాంజి లాగా మెత్తగా ఉండే ఈ ఇడ్లీ కేక్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
స్పాంజ్ ఇడ్లీ కేక్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పంచదార – పావు కప్పు, నూనె – పావు కప్పు, కాచి చల్లార్చిన పాలు – అర కప్పు, వెనిగర్ లేదా నిమ్మరసం – ఒక టీ స్పూన్, వెనీలా ఎసెన్స్ – అర టీ స్పూన్, కోకో పౌడర్ – ఒకటిన్నర టేబుల్ స్పూన్, మైదాపిండి లేదా గోధుమపిండి – ముప్పావు కప్పు, బేకింగ్ పౌడర్ – ఒక టీ స్పూన్.
స్పాంజ్ ఇడ్లీ కేక్ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో పంచదార, నూనె, పాలు, వెనిగర్, వెనీలా ఎసెన్స్, కోకో పౌడర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో గోధుమపిండి లేదా మైదాపిండి వేసి ఉండలు లేకుండా అంతా కలిసేలా కలుపుకోవాలి. తరువాత బేకింగ్ పౌడర్ వేసి కలపాలి. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ లో అర గ్లాస్ నీళ్లు పోసి మూత పెట్టి వేడి చేయాలి. తరువాత ఇడ్లీ ప్లేట్ లను తీసుకుని వాటికరి నూనె రాయాలి. తరువాత కేక్ మిక్సీని ఇడ్లీ ప్లేట్ లల్లో ఇడ్లీల వలె వేసుకోవాలి.
తరువాత ఈ ప్లేట్ లను ఇడ్లీ కుక్కర్ లో ఉంచి మూత పెట్టి 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ ప్లేట్ లను బయటకు తీసి కేక్ పూర్తిగా చల్లారే వరకు ఉంచాలి. తరువాత ప్లేట్ నుండి వేరు చేసి వాటిపై చాక్లెట్ సిరప్ ను వేసి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే స్పాంజీ ఇడ్లీ కేక్ లు తయారవుతాయి. వీటిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. తియ్యగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా అప్పటికప్పుడు ఇంట్లోనే ఇడ్లీ కేక్ లను తయారు చేసుకుని తినవచ్చు.