Spring Rolls : స్ప్రింగ్ రోల్స్.. ఇవి మనకు ఎక్కువగా రెస్టారెంట్ లలో లభిస్తాయి. స్టాటర్ గా వీటిని తీసుకుంటూ ఉంటారు. స్ప్రింగ్ రోల్స్ చాలా రుచిగా ఉంటాయి. పైన క్రిస్పీగా లోపల రుచికరమైన స్టఫింగ్ తో ఈ రోల్స్ తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటాయి. ఈ స్ప్రింగ్ రోల్స్ ను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా సులభం. పైన పొర చాలా పలుచగా వచ్చేలా ఈ స్ప్రింగ్ రోల్స్ ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
స్ప్రింగ్ రోల్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదాపిండి – అర కప్పు, కార్న్ ఫ్లోర్ – పావు కప్పు, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
స్టఫింగ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన ఫ్రెంచ్ బీన్స్ ముక్కలు – పావు కప్పు, చిన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు – పావు కప్పు, చిన్నగా తరిగిన బంగాళాదుంప ముక్కలు – అర కప్పు, చిన్నగా తరిగిన టమాట – 1, చిన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలు – పావు కప్పు, పచ్చి బఠాణీ – పావు కప్పు, స్వీట్ కార్న్ – పావు కప్పు, పసుపు -పావు టీస్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, చాట్ మసాలా – అర టీ స్పూన్, నీళ్లు – పావు కప్పు.
స్ప్రింగ్ రోల్స్ తయారీ విధానం..
ముందుగా స్టఫింగ్ కోసం కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి.తరువాత కూరగాయముక్కలు, టమాట ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వేయించాలి. ముక్కలు మెత్తబడిన తరువాత కారం, ధనియాల పొడి, చాట్ మసాలా వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. వీటిని నీరంతా పోయే వరకు ఉడికించిన తరువాత పప్పు గుత్తితో మెత్తగా చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి. తరువాత కార్న్ ఫ్లోర్, ఉప్పు వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ గంటె జారుడుగా పిండిని కలుపుకోవాలి. తరువాత స్టవ్ మీద నాన్ స్టిక్ కళాయిని ఉంచి వేడి చేయాలి. కళాయి కొద్దిగా వేడయ్యాక బ్రష్ తో పిండిని తీసుకుని కళాయిపై రాసుకోవాలి.
ఎక్కడ గ్యాప్ లేకుండా ఒక షీట్ లాగా పిండిని రాసుకోవాలి. కాలే కొద్ది ఈ షీట్ కళాయి నుండి నెమ్మదిగా వేరవుతుంది. ఇలా వేరవ్వగానే షీట్ ని తీసి ప్లేట్ వేసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత ఒక గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో షీట్ ను తీసుకుని అందులో ఒక చివరన ముందుగా తయారు చేసుకున్న స్టఫింగ్ ను 2 టేబుల్ స్పూన్ల మోతాదులో ఉంచి సర్దుకోవాలి. తరువాత అంచులను లోపలికి మడిచి ఊడిపోకుండా మైదాపిండి పేస్ట్ ను రాసి రోల్ చేసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక రోల్స్ ను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే స్ప్రింగ్ రోల్స్ తయారవుతాయి. వీటిని వేడి వేడి టమాట కిచప్ తో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.