Sprouts Breakfast : చాలా మంది ఉదయం బ్రేక్‌ఫాస్ట్ రూపంలో అనేక ఆహారాలను తింటుంటారు. కొందరు ఇడ్లీలు తింటే కొందరు పూరీలు, దోశలను, ఇంకొందరు బొండాలను తింటుంటారు. అయితే వాస్తవానికి ఇవన్నీ మనకు శక్తిని అందించేవే. అయినప్పటికీ ఆరోగ్యపరంగా వీటితో మనకు మేలు జరగదు. కనుక వీటికి బదులుగా ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌ను తినాలి. దీంతో మనకు శక్తి అందడంతోపాటు ఇంకోవైపు ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఇక ఇలాంటి బ్రేక్‌ఫాస్ట్‌లను తింటే బరువు తగ్గుతారు, ఆరోగ్యంగా ఉంటారు. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మొలకల బ్రేక్‌ఫాస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
మొలకలు – 1 కప్పు (పెసలు, పల్లీలు, శనగలు), ఉల్లిపాయ – 1 (సన్నగా తరగాలి), టమాటా – 1 (సన్నగా తరగాలి), పచ్చి మిర్చి – 1 (సన్నగా తరగాలి), జీలకర్ర – అర టీస్పూన్, పసుపు – అర టీస్పూన్, ఉప్పు – రుచికి సరిపడా, ఆలివ్ ఆయిల్ లేదా ఏదైనా వంట నూనె – 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర – కొన్ని (సన్నగా తరగాలి), నిమ్మకాయ ముక్కలు – కొన్ని (గార్నిష్ కోసం).
మొలకల బ్రేక్‌ఫాస్ట్‌ను తయారు చేసే విధానం..
మొలకలను ముందుగా బాగా కడిగి శుభ్రం చేయాలి. తరువాత అన్ని మొలకలను బాగా కలపాలి. అనంతరం నీటిని వంపేయాలి. ఒక పాన్ తీసుకుని అందులో నూనె వేసి మీడియం మంటపై వేడి చేయాలి. అనంతరం అందులో జీలకర్ర వేయాలి. అవి చిటపటలాడగానే తరిగిన ఉల్లిపాయలు వేసి వాటిని బాగా వేయించాలి. తరువాత పసుపు, పచ్చి మిర్చి వేసి మరో నిమిషం పాటు వేయించాలి. అనంతరం అందులో మొలకలను వేసి వేయించాలి. మొలకలు మెత్తగా మారే వరకు వేయించాలి. తరువాత రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. అనంతరం కొత్తిమీర, తరిగిన టమాటాలు, నిమ్మకాయ ముక్కలు పెట్టి గార్నిష్ చేయాలి. దీన్ని వేడిగా సర్వ్ చేయాలి. ఉదయాన్నే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ఒక కప్పు తిన్నా చాలు వెంటనే బరువు తగ్గుతారు. అలాగే అనేక పోషకాలను పొందవచ్చు. దీన్ని కూర రూపంలోనూ వండుకుని అన్నం లేదా చపాతీల్లో తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది.