Sprouts Curry : మొలకలను తినడం వల్ల ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. వీటిలో మన శరీరానికి కావల్సిన పోషకాలు అనేకం ఉంటాయి. అందువల్లనే పోషకాహార నిపుణులు, వైద్యులు సైతం మనల్ని మొలకలు తినాల్సిందిగా సూచిస్తుంటారు. అయితే మొలకలను నేరుగా తినలేని వారు వాటితో కూర చేసుకుని దాన్ని చపాతీలతో కలిపి తినవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ఈ క్రమంలోనే మొలకలతో కూరను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మొలకల కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
దోసకాయ ముక్కలు – ఒక కప్పు, అన్ని రకాల మొలకలు – ఒక కప్పు, జీలకర్ర – ఒక టీస్పూన్, ఇంగువ – చిటికెడు, పసుపు – అర టీస్పూన్, కారం – ఒక టీస్పూన్, ధనియాల పొడి – అర టీస్పూన్, జీలకర్ర పొడి – అర టీస్పూన్, ఉప్పు – రుచికి సరిపడా, కొత్తిమీర తురుము – పావు కప్పు.
మొలకల కూరను తయారు చేసే విధానం..
దోసకాయ చెక్కు తీసి చిన్న ముక్కల్లా కోయాలి. బాణలిలో నూనె వేసి జీలకర్ర, ఇంగువ వేసి వేగనివ్వాలి. తరువాత మొలకలు, పసుపు వేసి ఒక కప్పు నీళ్లు పోసి మీడియం మంటపై సుమారుగా 10 నిమిషాల పాటు ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అందులోనే దోసకాయ ముక్కలను, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు అన్నీ వేసి కలిపి మూత పెట్టి సిమ్‌లో ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. పూర్తిగా ఉడికిన తరువాత దించి కొత్తిమీర తురుము చల్లితే చాలు. ఎంతో రుచికరమైన మొలకల కూర రెడీ అవుతుంది. దీన్ని చపాతీల్లో తింటే ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు. మొలకలను నేరుగా తినలేకపోతే ఇలా కూర చేసుకుని తింటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం రెండూ లభిస్తాయి.