Bellam Paramannam : పరమాన్నం.. దీనిని రుచి చూడని వారు ఉండరు అని చెప్పవచ్చు. బెల్లంతో చేసే పరమాన్నం ఎంతో రుచిగా ఉంటుంది. దీనిని అప్పుడప్పుడు మనలో చాలా మంది తయారు చేస్తూ ఉంటారు. అయితే ఈ పరమాన్నం తయారు చేసేటప్పుడు పాలు విరిగిపోతూ ఉంటాయి. అలాగే పరమాన్నం చల్లారిన తరువాత గట్టిగా అవుతూ ఉంటుంది. పాలు విరగకుండా కూడా పరమనాన్ని మనం తయారు చేసుకోవచ్చు. పరమానాన్ని చక్కగా, రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బెల్లం పరమాన్నం తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – ఒక కప్పు, బెల్లం తురుము – ముప్పావు కప్పు, పాలు – అర లీటర్, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, నీళ్లు – మూడు కప్పులు, యాలకుల పొడి – అర టీ స్పూన్, డ్రై ఫ్రూట్స్ – తగినన్ని.
బెల్లం పరమాన్నం తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో బియ్యాన్ని తీసుకుని శుభ్రపరుచుకోవాలి. తరువాత అందులో రెండు కప్పుల నీళ్లు, ఒక కప్పు పాలు పోసి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తరువాత మూత తీసి గంటెతో అన్నాన్ని మెత్తగా చేసి పక్కకు పెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో ఒక కప్పు నీళ్లు, బెల్లం తురుము వేసి బెల్లం కరిగే వరకు కలుపుతూ ఉండాలి. బెల్లం కరిగిన తరువాత ఒక పొంగు వచ్చే వరకు వేడి చేసి పక్కకు పెట్టాలి. తరువాత ఒక చిన్న కళాయిలో నెయ్యి వేసి నెయ్యి కరిగిన తరువాత డ్రైఫ్రూట్స్ వేసి వేయించాలి.
ఇప్పుడు అన్నంలో మిగిలిన పాలు పోసి దగ్గరగా అయ్యే వరకు 5 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీయాలి. ఇప్పుడు దీనిలో ముందుగా ఉడికించిన బెల్లం మిశ్రమాన్ని వేసి కలపాలి. తరువాత యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బెల్లం పరమాన్నం తయారవుతుంది. ఈ విధంగా చేయడం వల్ల పాలు విరగకుండా పరమాన్నం చల్లారిన తరువాత కూడా గట్టిగా అవ్వకుండా ఉంటుంది. తీపి తినాలనిపించినప్పుడు చాలా త్వరగా అయ్యే ఈ పరమానాన్ని చేసుకుని తినవచ్చు.