Stambheshwarnath Temple : మన దేశంలో ఉన్న ఎన్నో చారిత్రాత్మక ఆలయాలకు ఒక్కో విశేషం ఉంటుంది. ప్రతి ఆలయానికి స్థల పురాణం, ఘనమైన చరిత్ర ఉంటాయి. కానీ చాలా వరకు అలాంటి విశిష్టతలు ఉన్న ఆలయాల గురించి మనకు తెలియదు. ఇప్పుడు చెప్పబోయే ఆలయం కూడా అదే కోవకు చెందుతుంది. దానికి ఉన్న విశిష్టతలను తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు. మరింకెందుకాలస్యం.. ఆ ఆలయం ఏమిటో.. దాని విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు సమీపంలో భావ్ నగర్ అనే ప్రాంతం ఉంది. అక్కడికి దగ్గరలో ఉన్న కవికాంబోయి అనే గ్రామానికి సమీపంలో అరేబియా మహా సముద్రం ఉంటుంది. ఆ సముద్రంలోనే స్తంభేశ్వరనాథ ఆలయం ఉంటుంది. దీనికి చాలా విశిష్టతలు ఉన్నాయి. ఈ ఆలయానికి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లలేం.
మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6.30 గంటల లోపు మాత్రమే ఆలయంలో స్వామివారి దర్శనానికి అనుమతినిస్తారు. ఎందుకంటే మిగిలిన సమయంలో ఈ ఆలయం సముద్రంలో మునిగిపోయి ఉంటుంది. అవును, నిజమే. అందుకే ఈ ఆలయానికి స్తంభేశ్వరనాథ ఆలయం అని పేరు వచ్చింది. ఇక ఆలయం మునిగి ఉన్నప్పుడు కేవలం శిఖరం, ధ్వజ స్తంభాలు మాత్రమే భక్తులకు కనిపిస్తాయి.
అయితే పైన చెప్పినట్లుగా దైవ దర్శానికి రోజూ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6.30 గంటలు అని ఏమీ ఉండదు. ఆ సమయం ఒక్కోసారి మారుతుంది. కొన్ని సార్లు ఉదయమే ఆలయం పైకి వచ్చి ఉంటుంది. మధ్యాహ్నం మునిగి ఉంటుంది. కనుక ఆ సమయాల్లో మాత్రం భక్తులకు ముందుగా చిట్టీల ద్వారా ఆలయం మునిగే సమయాన్ని తెలియపరుస్తారు. దీంతో ఆలయం దగ్గరకు వెళ్లే భక్తులు ఆ సమయం చూసుకుని.. దైవ దర్శనం, పూజలు చేసుకుని.. ఆ సమయం కన్నా ముందుగానే తిరిగి రావాల్సి ఉంటుంది. ఇక ఆలయం వద్దకు వెళ్లేందుకు తీరం నుంచి తాడును ఏర్పాటు చేస్తారు. దాన్ని పట్టుకుని ఆలయం వరకు వెళ్లి తిరిగి రావాలి.
స్తంభేశ్వరనాథ ఆలయంలోకి వెళ్లడం రిస్క్‌తో కూడుకున్న పని కనుక.. 70 ఏళ్లకు పైబడిన వారిని, 10 ఏళ్ల లోపు వారిని అనుమతించరు. ఇక ఈ ఆలయంలో పూజారులు ఎవరూ ఉండరు. భక్తులే శివలింగానికి అభిషేకం చేస్తారు. పూలు సమర్పిస్తారు. లింగం మునిగాక ఆ పూలు ఒడ్డుకు వస్తాయి. వాటిని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. ఆ పూలు దొరికితే తాము కోరినవి నెరవేరుతాయని, ఇంట్లో వాటిని పెట్టుకుంటే సమస్యలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. ఇక ఆలయం మునిగిపోయే, తేలే దృశ్యాలను తీరం నుంచి చూసేందుకు కూడా చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. అయితే ఆ రెండు సన్నివేశాలను చూడాలంటే అక్కడ ఒక రోజు గడపాల్సి ఉంటుంది.
ఈ ఆలయాన్ని నిర్మించి కొన్ని వందల ఏళ్లు అవుతున్నా, అది రోజూ మునిగి, తేలుతున్నా.. ఆ ఆలయం ఇప్పటికీ చెక్కు చెదరకపోవడం విశేషం. అలాగే పౌర్ణమి రోజుల్లో ఈ ఆలయంలోని శివలింగం ఒక రకమైన కాంతితో మెరిసిపోతుందని భక్తులు చెబుతారు. ఆ రోజు స్వామివారిని దర్శనం చేసుకోవడం చాలా రిస్క్ అని, ఒక వేళ దర్శనం చేసుకుంటే మాత్రం ఎంతో పుణ్యం దక్కుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఇక ఆలయానికి సంబంధించి స్థల పురాణం చెబుతున్నదేమిటంటే.. పూర్వం తారకాసురుడనే రాక్షసున్ని వధించిన తరువాత కుమారస్వామి శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్టించి పూజలు చేశాడని చెబుతారు. దాని గురించి స్కంద పురాణంలో ఉంటుందట. ఇక మరో కథ ప్రకారం కురుక్షేత్ర యుద్ధం ముగిశాక పాండవులు ఇక్కడికి వచ్చి శివలింగాన్ని ఏర్పాటు చేసి పూజించారని చెబుతారు. కనుకనే ఈ శివలింగాన్ని దర్శించుకుంటే సర్వ పాపాలు పోతాయని భక్తులు నమ్ముతారు.
ఈ ఆలయానికి వెళ్లాలనుకుంటే వడోదర వెళ్లాలి. అక్కడి నుంచి 52 కిలోమీటర్ల దూరంలో కవికాంబోయి ఉంటుంది. అహ్మదాబాద్ లేదా వడోదరలలో ఏ ప్రాంతానికి చేరుకున్నా సరే.. వాటి నుంచి కవికాంబోయికి వెళ్లవచ్చు. అయితే అక్కడికి వెళ్లాలంటే బస్సు కన్నా ట్యాక్సీ అయితేనే ఉత్తమం. సౌకర్యవంతంగా ఉంటుంది. ఇక కవికాంబోయి వెళ్లాక అక్కడ ఉండే సముద్రపు ఒడ్డు నుంచి సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్తే ఈ ఆలయానికి చేరుకోవచ్చు.