Sweet Corn Vadalu : మనం ఆహారంగా స్వీట్ కార్న్ ను కూడా తీసుకుంటూ ఉంటాం. స్వీట్ కార్న్ చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. స్వీట్ కార్న్ లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. స్వీట్ కార్న్ ను మనం ఎక్కువగా ఉడికించి తీసుకుంటూ ఉంటాం. అలాగే వివిధ రకాల వంటల్లో, చిరుతిళ్ల తయారీలో ఉపయోగిస్తూ ఉంటాం. ఈ స్వీట్ కార్న్ తో మనం ఎంతో రుచిగా ఉండే వడలను కూడా తయారు చేసుకోవచ్చు. స్వీట్ కార్న్ తో చేసే వడలు చాలా రుచిగా ఉండడంతో పాటు వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. స్వీట్ కార్న్ తో రుచిగా వడలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
స్వీట్ కార్న్ వడ తయారీకి కావల్సిన పదార్థాలు..
స్వీట్ కార్న్ గింజలు – ఒక కప్పు, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, జీలకర్ర – అర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, పసుపు – రెండు చిటికెల పసుపు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, మిరియాల పొడి – ఒక టీ స్పూన్, నిమ్మరసం – అర చెక్క, బియ్యం పిండి- 2 టేబుల్ స్పూన్స్, శనగపిండి – 2 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
స్వీట్ కార్న్ వడల తయారీ విధానం..
ముందుగా స్వీట్ కార్న్ గింజలను జార్ లో వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. అవసరమైతే రెండు టీ స్పూన్ల నీటిని వేసి కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వడలాగా చేసి చూసుకోవాలి. వడ చేయడానికి చక్కగా వస్తే నూనెలో వేసి కాల్చుకోవాలి లేదంటే మరికొద్దిగా బియ్యంపిండి వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ వేడి నూనెలో వేసి కాల్చుకోవాలి. ఈ వడలను మధ్యస్థ మంటపై ఎర్రగా కరకరలాడే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే స్వీట్ కార్న్ వడలు తయారవుతాయి. వీటిని అల్లం చట్నీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా తినడానికి ఈ వడలు చాలాచక్కగా ఉంటాయి. ఈ వడలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.