Sweet Flowers : మనకు స్వీట్ షాపుల్లో లభించే తీపి పదార్థాల్లో స్వీట్ ఫ్లవర్స్‌కూడా ఒకటి. ఇవి చూడడానికి పువ్వు ఆకారంలో కలర్ ఫుల్ గా చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఈ స్వీట్ ఫ్లవర్స్ ను అదే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా సులభం. మొదటిసారి చేసే వారు కూడా వీటిని సులభంగా చేయవచ్చు. తీపి తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈ స్వీట్ ఫ్లవర్స్ ను తయారు చేసుకుని తినవచ్చు. ఎంతో రుచిగా, మెత్తగా ఉండే ఈ స్వీట్ ఫ్లవర్స్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
స్వీట్ ఫ్లవర్ తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదాపిండి – ఒకటిన్నర కప్పు, ఉప్పు – చిఇకెడు, వంటసోడా – 2 చిటికెలు, నెయ్యి – పావు కప్పు, పాలల్లో నానబెట్టిన కుంకుమ పువ్వు – చిటికెడు, ఆరెంజ్ పుడ్ కలర్ – చిటికెడు, పంచదార -ఒక కప్పు, నీళ్లు – అర కప్పు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
స్వీట్ ఫ్లవర్ తయారీ విధానం..
ముందుగా మైదాపిండిని ఒక గిన్నెలో తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, వంటసోడా వేసి కలపాలి. తరువాత నెయ్యి వేసి కలపాలి. ఇప్పుడు పిండిని 60 : 40 నిష్పత్తిలో రెండు భాగాలుగా చేసుకోవాలి. తక్కువ పిండిలో కుంకుమ పువ్వు పాలు వేసి ఉండలా కలపాలి. కుంకుమ పువ్వు అందుబాటులో లేని వారు ఎల్లో ఫుడ్ కలర్ ను కూడా ఉపయోగించవచ్చు. తరువాత ఎక్కువగా ఉన్న పిండిలో ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసి కలపాలి. దీనిని తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఉండలా కలుపుకోవాలి. తరువాత ఎల్లోకలర్ పిండిని తీసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. తరువాత ఆరెంజ్ కలర్ వేసి పిండిని తీసుకుంటూ ముందుగా చెక్క అప్పలాగా చేత్తో వత్తుకోవాలి. తరువాత దీని మధ్యలో ఎల్లో కలర్ పిండి ముద్దను ఉంచి అంచులను మూసి వేయాలి.
తరువాత దీనిని గుండ్రంగా చేసుకోవాలి. ఇప్పుడు కత్తితో ఒక ఇంచు లోతుగా అలాగే ఒక ఇంచు వెడల్పుగా ప్లస్ ఆకారంలో గాట్లు పెట్టుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో పంచదార, నీళ్లు పోసి ఉడికించాలి. పంచదార కరిగి లేత తీగపాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె మధ్యస్థంగా వేడయ్యాక ముందుగా సిద్దం చేసుకున్న పువ్వులను వేసి చిన్న మంటపై 5 నిమిషాల పాటు వేయించాలి. తరువాత మంటను మధ్యస్థంగా చేసి రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. తరువాత వీటిని పంచదార పాకంలో వేసి 10 నిమిషాల పాటు ఉంచాలి. మధ్య మధ్యలో వీటిపై పంచదార పాకాన్ని పోస్తూ ఉండాలి. పది నిమిషాల తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే స్వీట్ ఫ్లవర్స్ తయారవుతాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.