Stuffed Masala Idli : మనం అల్పాహారంలో భాగంగా ఇడ్లీలను కూడా తయారు చేసుకుని తింటూ ఉంటాము. ఇడ్లీలను చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే తరచూ ఒకేరకం ఇడ్లీలు కాకుండా మనం మరింత రుచిగా ఉండే మసాలా ఇడ్లీలను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ ఇడ్లీలను తయారు చేయడం చాలా సులభం. ఇడ్లీలను తినని వారు కూడా ఈ రకంగా చేసిన ఇడ్లీలను ఇష్టంగా తింటారు. ఇడ్లీలను తినని వారు కూడా ఈ మసాలా ఇడ్లీలను ఇష్టంగా తింటారు. ఎంతో రుచిగా ఉండే స్టఫ్డ్ మసాలా ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
స్టఫ్డ్ మసాలా ఇడ్లీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన అల్లం – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 3, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, కరివేపాకు -ఒక రెమ్మ, ఉప్పు- తగినంత, కారం – అర టీ స్పూన్, పసుపు – చిటికెడు, గరం మసాలా -ఒక టీ స్పూన్, ఆమ్ చూర్ పొడి లేదా నిమ్మరసం – ఒక టీ స్పూన్, ఉడికించి మెత్తగా చేసిన బంగాళాదుంపలు – 3, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, ఇడ్లీ పిండి – తగినంత.
స్టఫ్డ్ మసాలా ఇడ్లీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత జీలకర్ర, అల్లం వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, ఉప్పు, ఉల్లిపాయ, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత కారం వేసి కలపాలి. తరువాత పసుపు, గరం మసాలా, ఆమ్ చూర్ పొడి వేసి కలపాలి. తరువాత బంగాళాదుంపలను మెత్తగా చేసి వేసుకోవాలి. వీటిని అంతా కలిసేలా కలుపుకుని 3 నిమిషాల పాటు వేయించి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం కొద్దిగా చల్లారిన తరువాత కొద్ది కొద్దిగా తీసుకుంటూ సిలిండర్ ఆకారంలో చుట్టుకుని పక్కకు ఉంచాలి. తరువాత గ్లాస్ ను లేదా చిన్నగా ఉండే స్టీల్ డబ్బాను తీసుకుని అందులో ముందుగా ఇడ్లీ పిండిని వేయాలి.
తరువాత గ్లాస్ మధ్యలో బంగాళాదుంప మిశ్రమాన్ని ఉంచి చుట్టూ ఇడ్లీ పిండిని వేసుకోవాలి. తరువాత ఇడ్లీ కుక్కర్ లో నీళ్లు పోసి అందులో ఈ గ్లాస్ లను ఉంచి మూత పెట్టాలి. వీటిని 15 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని బయటకు తీసి మరో 5 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత గ్లాస్ నుండి వేరు చేసి నచ్చిన ఆకారంలో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా వేసుకోవడం రాని వారు ఇడ్లీ ప్లేట్ ను తీసుకుని అందులో కొద్దిగా ఇడ్లీ పిండిని వేయాలి. తరువాత బంగాళాదుంప మిశ్రమాన్ని ఉంచి దానిపై నుండి మరికొద్దిగా ఇడ్లీ పిండిని వేసుకుని ఉడికించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మసాలా ఇడ్లీలు తయారవుతాయి. వీటిని చట్నీ, సాంబార్ లేకపోయినా నేరుగా తినవచ్చు.