Sweet Kharjura : మనం పంచదారతో రకరకాల తియ్యటి వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. పంచదార రుచిని అందరూ ఇష్టపడతారు. పంచదారను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. కనుక అప్పుడప్పుడూ మాత్రమే పంచదారతో తీపి వంటకాలను తయారు చేసుకుని తినాలి. పంచదారతో చేసుకోదగిన వంటకాల్లో స్వీట్ ఖర్జూరాలు కూడా ఒకటి. వీటిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఈస్వీట్ ఖర్జూరాలను తయారు చేయడం చాలా సులభం. తక్కువ సమయంలో తయారు చేసుకోగలిగే ఈ స్వీట్ ఖర్జూరాల తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. వీటిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
స్వీట్ ఖర్జూర తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదా పిండి – 200 గ్రా., పంచదార – 150 గ్రా., కరిగించిన బటర్ – 30 గ్రా., నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, బేకింగ్ సోడా – చిటికెడు, బేకింగ్ పౌడర్ – పావు టీ స్పూన్.
స్వీట్ ఖర్జూర తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి. తరువాత బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసి కలపాలి. ఇప్పుడు కరిగించిన బటర్ ను వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోస్తూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి పక్కకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో పంచదార, రెండున్నర కప్పుల నీటిని పోసి వేడి చేయాలి. పంచదార కరిగి కొద్దిగా జిగురుగా అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత పిండిని మరో సారి బాగా కలపాలి. ఇప్పుడు కొద్ది పరిమాణంలో పిండిని తీసుకుని చేత్తో సన్నగా పొడుగ్గా రోల్ చేసుకోవాలి. తరువాత ఈ రోల్ ను కత్తితో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక పిండి ముక్కలను వేసి మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. తరువాత వీటిని తీసి ముందుగా తయారు చేసిన పంచదార మిశ్రమంలో వేసి ఒక నిమిషం పాటు ఉంచాలి. తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే స్వీట్ ఖర్జూర తయారవుతుంది. తీపి తినాలనిపించినప్పుడు, ఇంటికి అతిధులు వచ్చినప్పుడు ఈవిధంగా చాలా తక్కువ సమయంలో అయ్యే ఈ స్వీట్ ఖర్జూరాలను తయారు చేసుకుని తినవచ్చు.