Sweet Shop Style Palakova : మనకు స్వీట్ షాపుల్లో లభించే పదార్థాల్లో పాలకోవా కూడా ఒకటి. పాలతో చేసే ఈ తీపి వంటకం చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ దీనిని ఇష్టంగా తింటారు. ఎంతో రుచిగా ఉండే ఈ పాలకోవాను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. పాలు, పంచదార ఉండాలే కానీ దీనిని తయారు చేయడం చాలా తేలిక. స్వీట్ షాప్ స్టైల్ లో పాలకోవాను తయారు చేసే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
స్వీట్ షాప్ స్టైల్ పాలకోవా తయారీకి కావల్సిన పదార్థాలు..
చిక్కటి పాలు – లీటర్నర, పంచదార – 300 గ్రా..
స్వీట్ షాప్ స్టైల్ పాలకోవా తయారీ విధానం..
ముందుగా అడుగు మందంగా ఉండే గిన్నెలో పాలను పోసి వేడి చేయాలి. ఈ పాలను మధ్యస్థ మంటపై అంచులకు మీగడ అంటుకుపోకుండా కలుపుతూ మరిగించాలి. పాలు బాగా మరిగిన తరువాత రంగు మారడంతో పాటు చిక్కబడతాయి. పాలు మూడు వంతులు చిక్కబడిన తరువాత పంచదార వేసి కలపాలి. పంచదార వేయగానే పాలు మరలా పలుచబడతాయి. దీనిని మరలా చిక్కబడే వరకు కలుపుతూ వేడి చేయాలి. పాలు చిక్కబడిన తరువాత కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుని ఉండలా చుట్టి చూడాలి. ఈ కోవా ఉండలా చుట్టడానికి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒకవేళ ఉండలా చుట్టడానికి రాకపోతే మరికొద్ది సేపు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి గుంత గంటెతో కోవాను మెత్తగా చేసుకోవాలి.
తరువాత దీనిని చల్లారే వరకు ఉంచాలి. కోవా చల్లారిన తరువాత నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని కోవాను చేత్తో మెత్తగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పాలకోవా తయారవుతుంది. ఈ పాలకోవాను చేతికి నెయ్యి రాసుకుంటూ కొద్ది కొద్దిగా తీసుకుంటూ కోవా ఉండలుగా లేదా బిళ్లలుగా చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసిన పాలకోవాను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. తీపి తినాలనిపించినప్పుడు బయట కొనుగోలు చేసే పనిలేకుండా ఇలా పాలకోవాను ఇంట్లోనే తయారు చేసుకుని తినవచ్చు.