Kanakambaram : మనం అనేక రకాల పూల మొక్కలను ఇళ్లల్లో పెంచుకుంటూ ఉంటాం. అనేక రకాల పూల మొక్కలు మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉంటాయి. అలాంటి వాటిలో కనకాంబరం పూల మొక్క కూడా ఒకటి. ఈ పూలు చూడడానికి చాలా అందంగా ఉంటాయి. గుత్తులు గుత్తులుగా పూసే ఈ కనకాంబరాలు పెరటికి అందాన్ని తీసుకు వస్తాయనే చెప్పవచ్చు. స్త్రీలు ఈ పూలను మాలగా కట్టి జడలో ధరిచండానికి చాలా ఇష్టపడతారు. అయితే కొందరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ కనకాంబరం మొక్కలను ఏపుగా, ఎక్కువ పువ్వులు పూసేలా చేయలేకపోతుంటారు. కనకాంబరం మొక్కలు ఏపుగా పెరిగి ఎక్కువ పువ్వులు పూయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కనకాంబరం మొక్క పొదలా పెరుగుతుంది. ఇతర చెట్ల లాగానే దీనికి కూడా చీడ పీడలు పడతాయి. మనకు ఎరుపు, నారింజ, పసుపు రంగుల్లో ఉండే మూడు రకాల కనకాంబరాలు దొరుకుతాయి. కరకాంబరం మొక్క విత్తనం ద్వారానే కాకుండా కొమ్మ ద్వారా కూడా పెరుగుతుంది. చిన్న కనకాంబరం కొమ్మను తీసుకు వచ్చి భూమిలో నాటినా కూడా ఏపుగా పెరిగి గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయి. కనకాంబరాన్ని నల్ల రేగడిలో మట్టిలో నాటడం వల్ల పొదలా, గుబురుగా, అందంగా పెరుగుతుంది. కొన్ని రకాల మొక్కలు నీడలో కూడా పెరుగుతాయి. కానీ కనకాంబరం మొక్క నీడలో ఉంటే చనిపోతుంది. కనుక సూర్యరశ్మి చక్కగా తగిలే ప్రాంతంలోనే దీనిని పెంచాలి. కనకాంబరం మొక్క పొడుగ్గా, ఈనెలు ఈనెలుగా పెరుగుతుంది. ఇలా పెరగడం వల్ల మొక్క అందంగా కనిపించదు. అలాగే ఈదురు గాలులు వీచినప్పుడు ఈ మొక్క పడిపోయే అవకాశం ఉంటుంది. కనుక ఈ మొక్క కొద్దిగా పెరగగానే కత్తెరతో దీని చివర్లను కత్తిరించాలి. ఇలా చేయడం వల్ల మొక్క పొదలాగా గుబురుగా పెరుగుతుంది.

కనకాంబరం మొక్క పొడుగ్గా పెరిగిన ప్రతిసారీ వాటి చివర్లను కత్తిరిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మనం ఎక్కువ కనకాంబరం పూలను కూడా పొందవచ్చు. ఈ మొక్క వాడిపోయినట్టు కానీ, క్రిమికీటకాలు పట్టినట్టు కానీ కనబడితే వెంటనే నాలుగు నిమ్మకాయలను ముక్కలుగా చేసి నీటిలో వేసి మరిగించాలి. ఆ నీటిలో ఉప్పును వేసి కలిపి కొద్దిగా చల్లగా అయిన తరువాత మొక్క మొత్తం తడిచేలా పిచికారీ చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల మొక్కకు పట్టిన క్రిమికీటకాలు అన్నీ నశించిపోతాయి. అలాగే వేపాకును కూడా నీటిలో వేసి మరిగించి ఆ నీటిని స్ప్రే బాటిల్ పోసి ప్రతి ఆకు తడిచేలా స్ప్రే చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా చీడ పీడలు తొలగిపోతాయి. మనం ఆహారంగా తీసుకునే పండ్ల తొక్కలను ముక్కలుగా చేసి ఎరువుగా వేయడం వల్ల ఈ మొక్కకు మంచి పోషకాలు లభిస్తాయి.
అలాగే కోడిగుడ్లను ఉడకబెట్టి ఆ నీటితో సహా వాటి పెంకులను కూడా మొక్కకు వేయాలి. ఇలా చేయడం వల్ల కూడా మొక్కకు ఎన్నో పోషకాలు అందుతాయి. బియ్యం కడిగిన నీటిని, బియ్యం వార్చిన గంజిని మొక్కకు పోయడం వల్ల కూడా కనకాంబరం మొక్కలు ఏపుగా గుబురుగా పెరుగుతాయి. పూలు కూడా ఎక్కువగా పూస్తాయి. ఈ మొక్క పూలు పూయడం ఆగిన తరువాత విత్తనాలు వస్తాయి. వీటిని జాగ్రత్తగా సేకరించి నాలుగైదు రోజులు ఎండబెట్టి ఒక రోజంతా నీటిలో నానబెట్టి ఆ తరువాత భూమిలో నాటాలి. ఇలా చేయడం వల్ల కనకాంబరం మొక్కలు ఎక్కువగా మొలుస్తాయి. ఈ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కనకాంబరం మొక్కలు చక్కగా పెరగడమే కాకుండా ఎక్కువ పూలను కూడా పూస్తాయి.