Thotakura Tomato Pulusu : మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో తోటకూర ఒకటి. ఇది మనకు అన్నీ కాలాల్లో విరివిరిగా లభ్యమవుతూ ఉంటుంది. ఇతర ఆకుకూరల వలే తోటకూర కూడా మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. తోటకూరతో వేపుడు, పప్పు వంటి వాటిని ఎక్కువగా తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా తోటకూరతో మనం పులుసు కూరను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. వంటరాని వారు కూడా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ తోటకూర టమాట పులుసు కూరను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తోటకూర టమాట పులుసు కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన తోటకూర – 3 కట్టలు, తరిగిన ఉల్లిపాయలు – 3, తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన టమాటాలు – 4, నూనె – 2 టేబుల్ స్పూన్స్, వెల్లుల్లి రెబ్బలు – 5, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్,కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒకటిన్నర టీ స్పూన్ లేదా తగినంత, నీళ్లు – ఒకటిన్నర టీ గ్లాస్, నానబెట్టిన చింతపండు – రెండు రెమ్మలు.
తోటకూర టమాట పులుసు కూర తయారీ విధానం..
ముందుగా ఒక కుక్కర్ లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత టమాట ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కలిపి మూత పెట్టి టమాట ముక్కలను మగ్గించాలి. టమాట ముక్కలు మగ్గిన తరువాత కారం వేసి కలపాలి. తరువాత తోటకూర వేసి కలపాలి. తోటకూర దగ్గర పడిన తరువాత అందులో నీళ్లు పోసి కలపాలి. తరువాత దానిపై మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆవిరి పోయిన తరువాత మూత తీసి మరలా స్టవ్ మీద ఉంచి వేడి చేయాలి. తరువాత ఇందులో చింతపండు రసం వేసి కలపాలి. మరో 3 నిమిషాల పాటు దీనిని ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే తోటకూర టమాట పులుసు కూర తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. తోటకూరతో తరచూ వేపుడు కూరలనే కాకుండా ఇలా పులుసు కూరను కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఈ కూరను వద్దనకుండా అందరూ ఇష్టంగా తింటారు. తోటకూరను ఇష్టపడని వారికి ఇలా కూర చేసి ఇవ్వడం వల్ల రుచితో పాటు తోటకూరతో శరీరానికి కలిగే లాభాలను కూడా అందించవచ్చు.