Tomato Kurma : టమాటాలతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. టమాటాలు లేని వంటగది ఉండదనే చెప్పవచ్చు. అలాగే టమాటాలతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఇతర కూరగాయలతో కలిపి వండడంతో పాటు మనం కేవలం టమాటాలతో కూడా వివిధ రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. ఇలా టమాటాలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో టమాటా కుర్మా కూడా ఒకటి. ఇంట్లో ఇతర కూరగాయలు లేనప్పుడు ఇలా టమాటాలతో కుర్మాను తయారు చేసుకుని తినవచ్చు. ఈ కుర్మాను 20 నిమిషాల్లో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ టమాట కుర్మాను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట కుర్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, సన్నగా తరరిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, పెద్ద ముక్కలుగా తరిగిన టమాటాలు – 3, పసుపు – పావు టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, నీళ్లు – ఒక కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మసాలా పేస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నువ్వులు – 2 టీ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, మెంతులు -పావు టీ స్పూన్, ధనియాలు -ఒక టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 3, యాలకులు – 3, పచ్చిమిర్చి – 3, పచ్చి కొబ్బరి ముక్కలు – 2 టీ స్పూన్స్, చింతపండు – ఒక రెమ్మ.
టమాట కుర్మా తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నువ్వులు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి దోరగా వేయించాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని అందులోనే మిగిలిన పదార్థాలన్నీ వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి పెద్ద మంటపై 2 నిమిషాల పాటు వేయించాలి.
ఇప్పుడు మంటను మధ్యస్థంగా చేసి ఉప్పు, కారం, పసుపు వేసి కలపాలి. తరువాత టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించాలి. టమాట ముక్కలు మెత్తగా అయిన తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్, నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు మూత పెట్టి మరో 10 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత కొత్తిమీరను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట కుర్మా తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, దోశ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. టమాటాలతో ఎప్పుడూ ఒకేరకం కూరలు కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసుకుని తినవచ్చు.