Tomato Meal Maker Masala Curry : మీల్ మేకర్.. ఇవి మనందరికి తెలిసినవే. మీల్ మేకర్ లో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు అందుతాయి. మీల్ మేకర్ లతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. మీల్ మేకర్ లతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో టమాట మీల్ మేకర్ మసాలా కర్రీ కూడా ఒకటి. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. వంటరాని వారు, బ్యాచిలర్స్ కూడా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. మీల్ మేకర్ లతో రుచిగా మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట మీల్ మేకర్ మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
మీల్ మేకర్ – ఒక కప్పు, తరిగిన టమాట – పావు కిలో, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 4, గరం మసాలా – ఒక టేబుల్ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు -తగినంత, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, కరివేపాకు – ఒక రెమ్మ.
మసాలా దినుసులు..
ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 5, యాలకులు – 3, జీడిపప్పు – 6, సాజీరా – ఒక టీ స్పూన్, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 5, అల్లం – ఒక ఇంచు ముక్క.
టమాట మీల్ మేకర్ మసాలా కర్రీ తయారీ విధానం..
ముందుగా మీల్ మేకర్ లను నీటిలో వేసి నానబెట్టాలి. తరువాత వీటిని చేత్తో పిండి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మీల్ మేకర్ లను వేసి వేయించాలి. వీటిని ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. వీటిని చిన్న మంటపై 5 నిమిషాల పాటు వేయించిన తరువాత జార్ లోకి తీసుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కరివేపాకు, టమాట ముక్కలు వేసి కలపాలి. టమాట ముక్కలను మెత్తగా ఉడికించిన తరువాత మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి కలపాలి.
దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత వేయించిన మీల్ మేకర్ వేసి కలపాలి. తరువాత మరో గ్లాస్ నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు దీనిపై మూతను ఉంచి 10 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట మీల్ మేకర్ మసాలా కర్రీ తయారవుతుంది. ఈ కూరను దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. మీల్ మేకర్ లతో తరచూ చేసే వంటకాలతో పాటు ఇలా మసాలా కూరను కూడా తయారు చేసుకుని తినవచ్చు.