Ullipaya Nilva Pachadi : మనం వంటల్లో ఉల్లిపాయలను విరివిగా వాడుతూ ఉంటాము. ఉల్లిపాయలు వేయడం వల్ల వంటల రుచి పెరగడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఇలా వంటల్లో వాడడంతో పాటు ఉల్లిపాయలతో మనం ఎంతో రుచిగా ఉండే నిల్వ పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. ఉల్లిపాయలతో చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో పాటు అల్పాహారాలతో కూడా దీనిని తినవచ్చు. ఈ పచ్చడిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా, కారంగా ఉండే ఈ ఉల్లిపాయ నిల్వ పచ్చడిని సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిపాయ నిల్వ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
మెంతులు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఆవాలు -ఒక టీ స్పూన్, నూనె – అరకప్పు, సాంబార్ ఉల్లిపాయ – 500 గ్రా., ఎండుమిర్చి -4, ఇంగువ – పావు టీ స్పూన్, పసుపు – ఒక టేబుల్ స్పూన్, కారం – 4 టేబుల్ స్పూన్స్, ఉప్పు – 2 టేబుల్ స్పూన్స్, చింతపండు రసం – 150 ఎమ్ ఎల్.
ఉల్లిపాయ నిల్వ పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసి దోరగా వేయించాలి. తరువాత వీటిని జార్ లో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. తరువాత కలాయిలో అర కప్పు నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక సాంబార్ ఉల్లిపాయలు వేసి వేయించాలి. ఈ ఉల్లిపాయలు చక్కగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా వేయించిన ఉల్లిపాయల నుండి 200 గ్రాముల ఉల్లిపాయలను జార్ లో వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో మరో అర కప్పు నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఎండుమిర్చి, ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఇంగువ వేసి వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమం వేసి కలపాలి.
దీనిని చిన్న మంటపై నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత మిగిలిన ఉల్లిపాయలను కూడా వేసికలపాలి. తరువాత పసుపు, కారం, ఉప్పు, మిక్సీ పట్టుకున్న పొడి వేసి కలపాలి. తరువాత చింతపండు రసం వేసి నూనె పైకి తేలే వరకు చిన్న మంటపై ఉడికించి స్టవ్ఆఫ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పచ్చడి పూర్తిగా చల్లారిన తరువాత గాజు సీసాలో వేసుకుని ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ నిల్వ పచ్చడి తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నంలో నెయ్యితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని లొట్టలేసుకుంటూ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.