Beans Pepper Masala : బీన్స్ పెప్పర్ మసాలా.. మనం ఆహారంగా తీసుకునే బీన్స్ తో తయారు చేసుకోగలిగిన కూరలల్లో ఇది కూడా ఒకటి. బీన్స్, మిరియాలు కలిపి చేసే ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. బీన్స్ తినని వారు కూడా ఈ ఫ్రైను ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. బీన్స్ తో తరుచూ ఒకేరకం ఫ్రై కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసుకుని తినవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. ఎంతో రుచిగా ఈ బీన్స్ పెప్పర్ మసాలా ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బీన్స్ పెప్పర్ మసాలా తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన బీన్స్ – పావుకిలో, నూనె – ఒక టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయలు – 2, తరిగిన టమాటాలు – 2, ఉప్పు – తగినంత, కారం – ఒక టేబుల్ స్పూన్, కొత్తిమీర -ఒక పెద్ద కట్ట, అల్లం – అర ఇంచు ముక్క, మిరియాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, దాల్చిన చెక్క – అర ఇంచు ముక్క, లవంగాలు – 3, యాలకులు – 2, కరివేపాకు – రెండు రెమ్మలు.
బీన్స్ పెప్పర్ మసాలా తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో బీన్స్ ముక్కలు వేసుకోవాలి. తరువాత ఇవి మునిగే వరకు నీళ్లు పోసి మూత పెట్టి పెద్ద మంటపై ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించాలి. తరువాత వీటిని వడకట్టి పక్కకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తరువాత టమాట ముక్కలు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి 3 నిమిషాల పాటు మగ్గించిన తరువాత ఉప్పు, కారం వేసి కలపాలి.తరువాత మూత పెట్టి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి చల్లారిన తరువాత జార్ లో వేసి పేస్ట్ లాగా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే జార్ లో కొత్తిమీర, అల్లం, మిరియాలు,జీలకర్ర వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో మరో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి.
తరువాత దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత బీన్స్ వేసి కలపాలి.వీటిని 5 నిమిషాల పాటు వేయించిన తరువాత మిక్సీ పట్టుకున్న టమాట పేస్ట్, కొత్తిమీర పేస్ట్ వేసి కలపాలి. తరువాత నీరంతా పోయి దగ్గర పడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బీన్స్ పెప్పర్ మసాలా తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగాఉంటుంది. ఈ విధంగా బీన్స్ తో ఫ్రై తయారు చేసి తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.