Ullipaya Pesarattu : పెసరట్టు ఎంత రుచిగా ఉంటుందో మనందరికీ తెలుసు. దీనిని తినడం వల్ల మనకు పెసలలో ఉండే పోషకాలు లభిస్తాయి. సరిగ్గా చేయాలే కానీ పెసరట్టు రుచి అదిరిపోతుంది. పెసలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందువల్ల వీటిని అట్ల రూపంలో వేసుకుని తింటే మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇక పెసరట్టును ఎలా తయారు చేయాలి.. దానికి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిపాయ పెసరట్టు తయారీకి కావల్సిన పదార్థాలు..
పెసలు – రెండు కప్పులు, బియ్యం – ఒక కప్పు, అల్లం – కొద్దిగా, పచ్చి మిర్చి – 4 లేదా 5, తరిగిన టమాట ముక్కలు – అర కప్పు, పెద్దగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – ఒక కప్పు, జీలకర్ర – 2 టీ స్పూన్స్, నూనె – ఒక కప్పు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – ఒక కప్పు, ఉప్పు – సరిపడా.
ఉల్లిపాయ పెసరట్టు తయారీ విధానం..
ముందుగా పెసలను, బియ్యాన్ని బాగా కడిగి 6 – 7 గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత ఒక జార్ లో నానబెట్టుకున్న పెసలు, బియ్యంతోపాటుగా అల్లం, పచ్చి మిర్చి, తరిగిన టమాట ముక్కలు, పెద్దగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర వేసి దోశ పిండిలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న పిండిలో రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పెనం పై ఈ పిండిని దోశలా వేసుకోవాలి. ఈ దోశ పై చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను, కొద్దిగా నూనెను వేసి ఎర్రగా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ దోశ తయారవుతుంది. దీనిని పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీలతో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది.