Ullipaya Pulusu : మనం వంటింట్లో రకరకాల పులుసు కూరలను తయారు చేస్తూ ఉంటాము. పులుసు కూరలు చాలా రుచిగా ఉండడంతో పాటు చాలా సులభంగా వీటిని తయారు చేసుకోవచ్చు. ఇలా మనం సులభంగా చేసుకోదగిన రుచికరమైన పులుసు కూరలల్లో ఉల్లిపాయ పులుసు కూడా ఒకటి. ఉల్లిపాయ పులుసు చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడుఈ పులుసును తయారు చేసి తీసుకోవచ్చు. ఈ పులుసును తయారు చేయడం చాలా తేలిక. దీనిని అందరూ లొట్టలేసుకుంటూ తింటారని చెప్పవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ఉల్లిపాయ పులుసును ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిపాయ పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
నానబెట్టిన చింతపండు- 50 గ్రా., నూనె – టేబుల్ స్పూన్స్, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు – 2, సాంబార్ ఉల్లిపాయలు – 10 నుండి 12, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, నీళ్లు – 300 ఎమ్ ఎల్, పసుపు – అర టీ స్పూన్, బెల్లం తురుము – 50 గ్రా., తరిగిన పచ్చిమిర్చి – 3, బియ్యం పిండి – ఒక టీ స్పూన్, కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్.
తాళింపుకు కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, మెంతులు – ఒక టీ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, ఇంగువ – చిటికెడు.
ఉల్లిపాయ పులుసు తయారీ విధానం..
ముందుగా చింతపండు నుండి 300 ఎమ్ ఎల్ చింతపండు రసాన్ని తీసి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, సాంబార్ ఉల్లిపాయలు వేసి వేయించాలి. వీటిని 3 నిమిషాల పాటు వేయించిన తరువాత ఉప్పు, కారం వేసి కలపాలి. తరువాత మూత పెట్టి మధ్యస్థ మంటపై ఉల్లిపాయలను మగ్గించాలి. ఉల్లిపాయలు మగ్గిన తరువాత చింతపండు రసం, నీళ్లు, పసుపు, బెల్లం తురుము వేసి మూత పెట్టి 15 నిమిషాల పాటు మరిగించాలి. తరువాత ఒక గిన్నెలో బియ్యంపిండిని తీసుకుని అందులో 50 ఎమ్ ఎల్ నీళ్లు పోసి కలపాలి.
తరువాత ఈ బియ్యంపిండిని మరుగుతున్న పులుసులో పోసి కలపాలి. దీనిని మరో 4 నిమిషాల పాటు మరిగించి కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కళాయిలో తాళింపుకు నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మెంతులు వేసి వేయించాలి. తరువాత ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, కరివేపాకు , ఇంగువ వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత దీనిని పులుసులో వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ పులుసు తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది.