Uppu Chepala Fry : చేపలను ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయని మనందరికీ తెలుసు. బరువు తగ్గడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో చేపలు ఎంతో సహాయపడతాయి. విటమిన్ డి లోపంతో బాధపడే వారికి చేపలు మంచి ఆహారమని నిపుణులు చెబుతున్నారు. చేపలతో వివిధ రకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం కూడా. మనకు మార్కెట్ లో పచ్చి చేపలే కాకుండా ఎండిన చేపలు కూడా లభిస్తూ ఉంటాయి. ఇలా లభించే వాటిలో ఉప్పు చేపలు కూడా ఒకటి. వీటిని ఇష్టపడే వారు కూడా చాలా మందే ఉంటారు. పప్పు చారుతో ఉప్పు చేపను తింటే ఆ రుచే వేరుగా ఉంటుంది. చాలా మంది ఉప్పు చేపను ఫ్రై గా చేసి పప్పు చారుతో తింటూ ఉంటారు. ఉప్పు చేపలను చాలా సులభంగా ఫ్రైగా చేసుకుని తినవచ్చు. ఉప్పు చేపలను ఫ్రై ఎలా చేయాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఉప్పు చేపల ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉప్పు చేపలు – 200 గ్రా., నూనె – ఒక టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి ముక్కలు – ఒక టీ స్పూన్, పసుపు – చిటికెడు, ఉప్పు – కొద్దిగా, కారం – ఒక టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్.
ఉప్పు చేపల ఫ్రై ని తయారు చేసే విధానం..
ముందుగా ఉప్పు చేపలను కావల్సిన పరిమాణంలో ముక్కలుగా చేసుకోవాలి. తరువాత ఒక కళాయిలో ఈ ముక్కలను వేసి రంగు మారే వరకు వేయించాలి. ఇలా వేయించిన వాటిని వేడి నీళ్లలో వేసి వీటిపై ఉండే పొట్టు, ఇసుక అంతా పోయేలా బాగా కడగాలి. ఒక కళాయిలో నూనె వేసి కాగిన తరువాత అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత కడిగి పెట్టుకున్న ఉప్పు చేప ముక్కలను వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత పసుపు, కారం, గరం మసాలా వేసి మరో నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని రుచి చూసిన తరువాత ఉప్పు తక్కువగా ఉంటేనే ఉప్పును వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా, వాసన లేకుండా ఉండే ఉప్పు చేపల ఫ్రై తయారవుతుంది. దీనిని పప్పు చారు, పప్పు కూరలతో కలిపి తింటే చాలా రుచిగా ఉండడంతోపాటు శరీరానికి కూడా మేలు జరుగుతుంది.