Vamu Rasam : మన వంటింట్లో ఉండే దినుసుల్లో వాము కూడా ఒకటి. దీనిని మనం వంటల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం. వాము చక్కటి వాసనను, ఘాటైన రుచిని కలిగి ఉంటుంది. వాములో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయన్న సంగతి మనకు తెలిసిందే. జీర్ణశక్తిని పెంచి గ్యాస్, అజీర్తి, కడుపు నొప్పి వంటి సమస్యలను తగ్గించడంలో, బరువు తగ్గడంలో, నొప్పులను తగ్గించడంలో, జలుబు మరియు దగ్గు వంటి వాటి నుండి ఉపశమనాన్ని కలిగించడంలో ఇలా అనేక రకాలుగా వాము మనకు సహాయపడుతుంది. వామును ఉపయోగించడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.
వంటల్లో వాడడంతో పాటు వాముతో మనం ఎంతో రుచిగా ఉండే వాము రసాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. వాము రసం తయారు చేయడం చాలా సులభం. ఈ రసం రుచిగా ఉండడంతో పాటు దీనిని తినడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వాముతో చక్కటి రుచిని కలిగి ఉండే రసాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వాము రసం తయారీకి కావల్సిన పదార్థాలు..
వాము – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, ధనియాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, తరిగిన పచ్చిమిర్చి – 2, నానబెట్టిన చింతపండు – నిమ్మకాయంత, పసుపు – పావు టీ స్పూన్,రాళ్ల ఉప్పు – తగినంత, కరివేపాకు – రెండు రెమ్మలు, నీళ్లు – 250 ఎమ్ ఎల్, నూనె – ఒక టీ స్పూన్.
వాము రసం తయారీ విధానం..
ముందుగా చింతపండు నుండి పావు లీటర్ చింతపండు రసాన్ని తీసుకోవాలి. తరువాత జార్ లో వాము, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, మెంతులు వేసి వేయించాలి. తరువాత జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత చింతపండు రసం, వాము పొడి, నీళ్లు, కరివేపాకు, ఉప్పు వేసి కలపాలి. దీనిని మధ్యస్థ మంటపై 10 నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వాము రసం తయారవుతుంది. ఈ రసం తయారు చేసేటప్పుడు వాము ఘాటు ఎక్కువగా పచ్చిమిర్చి, ఎండుమిర్చి కారం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే ఈ రసం చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో వాము రసాన్ని కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈ రసాన్ని తినడం వల్ల మనం ఆరోగ్యాన్ని కైడా పొందవచ్చు.