Vankaya Pachadi : మనం కూరగాయలతో రకరకాల పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాము. కూరగాయలతో చేసే పచ్చళ్లు రుచిగా ఉండడంతో పాటు వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. మనం సులభంగా చేసుకోదగిన రుచికరమైన పచ్చళ్లల్లో వంకాయ పచ్చడి కూడా ఒకటి. వంకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ పచ్చడిని ఇష్టంగా తింటారు. అయితే ఒకేరకంగా కాకుండా ఈ పచ్చడిని మనం మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. కింద చెప్పిన విధంగా చేసే ఈ వంకాయ పచ్చడి మరింత రుచిగా, కమ్మగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. మరింత రుచిగా ఈ వంకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వంకాయ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
వంకాయలు – పావుకిలో, నూనె – 2 టీ స్పూన్స్, పచ్చిమిర్చి – 10 లేదా కారానికి తగినన్ని, తరిగిన ఉల్లిపాయ – 1, అల్లం – ఒక చిన్న ముక్క, కరివేపాకు – ఒక రెమ్మ,చింతపండు – చిన్న నిమ్మకాయంత, ఉప్పు – తగినంత, వెల్లుల్లి రెబ్బలు – 10, జీలకర్ర – అర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్.
వంకాయ పచ్చడి తయారీ విధానం..
ముందుగా వంకాయలకు నూనె రాసి వాటిని మెత్తగా అయ్యే వరకు మంటపై కాల్చుకోవాలి. తరువాత వాటిపై ఉండే నల్లటి పొట్టును తొడిమెలను తీసేసి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, చింతపండు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు పూర్తిగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు వీటిని ఒక జార్ లోకి తీసుకుని ఇందులోనే ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, పసుపు వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి.
తరువాత కాల్చిన వంకాయలను వేసి మరోసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు తాళింపుకు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తాళింపు వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి పచ్చడిని వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ పచ్చడి తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన వంకాయ పచ్చడిని అందరూ లొట్టలేసుకుంటూ ఎంతో ఇష్టంగా తింటారు.