Vankaya Tomato Pachadi : మనం వంకాయలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. వంకాయలతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. వంకాయలతో కూరలే కాకుండా పచ్చళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాము. కింద చెప్పిన విధంగా చేసే వంకాయ టమాట పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో, నెయ్యితో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. కూర లేకపోయినా కేవలం పచ్చడితో అన్నమంతా తినేయవచ్చు. అంత రుచిగా ఉంటుంది ఈ పచ్చడి. అలాగే ఈ పచ్చడిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. చాలా తక్కువ సమయంలో, చాలా రుచిగా, తేలికగా ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ వంకాయ టమాట పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాల గురించి.. ఇప్పుడు తెలుసుకుందాం.
వంకాయ టమాట పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
వంకాయలు – 200గ్రా., టమాటాలు – 4( మధ్యస్థంగా ఉన్నవి), నూనె – ఒక టేబుల్ స్పూన్, పల్లీలు – ఒక టేబుల్ స్పూన్, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 10 నుండి 12, ఉప్పు – తగినంత, చింతపండు – ఉసిరికాయంత, కారం – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కొత్తిమీర – గుప్పెడు, వెల్లుల్లి రెమ్మలు – 8.
వంకాయ టమాట పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పల్లీలు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత ధనియాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి వేసి వేయించాలి. ఇవన్నీ వేగిన తరువాత ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత అదే కళాయిలో వంకాయలు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి వంకాయలను మగ్గించాలి. వంకాయలు మగ్గిన తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో మరి కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. తరువాత టమాట ముక్కలు, ఉప్పు, చింతపండు, కారం, పసుపు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు మగ్గించాలి. తరువాత కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ముక్కలు చల్లారిన తరువాత జార్ లో ముందుగా వేయించిన తరువాత దినుసులు, వెల్లుల్లి రెమ్మలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత వేయించిన టమాట ముక్కలు, వంకాయ ముక్కలు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఈ పచ్చడికి తాళింపు వేసి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ టమాట పచ్చడి తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగాఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన పచ్చడిని అందరూ లొట్టలేసుకుంటూ ఎంతో ఇష్టంగా తింటారు.