Vankayala Nilva Pachadi : వంకాయలతో మనం రకరకాల వంటకాలు తయారు చేసుకుని తింటూ ఉంటాం. వంకాలతో చేసే వంటకాలను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. వంకాయలతో కేవలం కూరనే కాకుండా పచ్చడిని తయారు చేసుకోవచ్చు. వంకాయలతో పచ్చడి అనగానే చాలా మంది ఒకటి లేదా రెండు రోజులు తాజాగా ఉండే పచ్చడి అనుకుంటారు. కానీ వంకాయలతో మనం మూడు నెలల పాటు నిల్వ ఉండే నిల్వ పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. వంకాయలతో నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వంకాయ నిల్వ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
ముదురు వంకాయలు – అర కిలో, ఉప్పు – మూడున్నర టేబుల్ స్పూన్స్, పసుపు – అర టీ స్పూన్, చింతపండు – 60 గ్రా., వెల్లుల్లి రెబ్బలు – 10, కారం – మూడున్నర టేబుల్ స్పూన్స్, మెంతి పొడి – ఒక టీ స్పూన్, పల్లీ నూనె – 150 గ్రా., ఆవాలు – అర టేబుల్ స్పూన్, జీలకర్ర – అర టేబుల్ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 10, ఎండుమిర్చి – 3, కరివేపాకు – రెండు రెమ్మలు.
వంకాయ నిల్వ పచ్చడి తయారీ విధానం..
ముందుగా వంకాయలను చిన్న ముక్కలుగా తరిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో మూడు టీ స్పూన్ల ఉప్పు, పసుపు, ఒక టేబుల్ స్పూన్ పల్లి నూనె వేసి బాగా కలపాలి. ఇప్పుడు వంకాయ ముక్కల మధ్యలో ఒక గుంత చేసి అందులో చింతపండును ఉంచాలి. ఈ చింతపండును ముక్కలతో మూసేసి వాటిపై మూతను ఉంచి ఒకరోజంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజూ వంకాయ ముక్కలు ఊరి చింతపండు మెత్తబడుతుంది. ఈ చింతపండును బయటకు తీసి దాని నుండి గుజ్జును తీయాలి. ఈ గుజ్జును ఒక జార్ లోకి తీసుకుని అందులో వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వంకాయ ముక్కల్లో కారం, మెంతి పొడి, అర టేబుల్ స్పూన్, ఉప్పు, మిక్సీ పట్టుకున్న చింతపండే పేస్ట్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి.
తరువాత ఇంగువ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తాళింపును ముందుగా తయారు చేసుకున్న పచ్చడిలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ పచ్చడి తయారవుతుంది. దీనిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల మూడు నెలల పాటు తాజాగా ఉంటుంది. ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవడం వల్ల ఆరు నెలల పాటు తాజాగా ఉంటుంది. దీనిని వేడి వేడి అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. వంకాయలతో కూరలనే కాకుండా ఇలా అప్పుడప్పుడూ పచ్చడిని కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఈ పచ్చడిని అందరూ ఇష్టంగా తింటారు.