Veg Omelette : ఆమ్లెట్.. దీనిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. ఆమ్లెట్ చాలా రుచిగా ఉంటుంది. మనం ఎక్కువగా దీనిని పప్పు, సాంబార్ వంటి కూరలతో కలిపి సైడ్ డిష్ గా తింటూ ఉంటాము. సాధారణంగా ఆమ్లెట్ ను కోడిగుడ్లతో తయారు చేస్తారన్న సంగతి మనకు తెలిసిందే. అయితే అందరూ కోడిగుడ్లను తినరు. కోడిగుడ్లను తినని వారు రుచిగా ఆమ్లెట్ ను తయారు చేసుకోవచ్చు. కింద చెప్పిన విధంగా చేసే ఈ వెజ్ ఆమ్లెట్ కూడా చాలా రుచిగా ఉంటుంది. 5 నిమిషాల్లోనే చాలా సులభంగా ఈ వెజ్ ఆమ్లెట్ ను తయారు చేసుకోవచ్చు. వెగన్ ఫుడ్ తినాలనుకునే వారు కూడా ఈ వెజ్ ఆమ్లెట్ ను తయారు చేసుకుని తినవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ వెజ్ ఆమ్లెట్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వెజ్ ఆమ్లెట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపిండి – 3 టీ స్పూన్స్, గోధుమపిండి – 2 టీ స్పూన్స్, రవ్వ – ఒక టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, చిన్నగా తరిగిన టమాట – 1, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, ఉప్పు -తగినంత, అల్లం తరుగు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, పసుపు – చిటికెడు.
వెజ్ ఆమ్లెట్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో రవ్వను, శనగపిండిని, గోధుమపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తరువాత ఇందులో తగినన్ని నీళ్లు పోసుకుంటూ దోశ పిండి కంటే పలుచగా కలుపుకోవాలి. ఇలా పిండిని కలుపుకున్న తరువాత స్టవ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక పెనం మీద నూనెను వేసుకోవాలి. తరువాత పిండిని తీసుకుని ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. దీనిపై కొద్దిగా నూనెను వేసుకుని మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత ఈ ఆమ్లెట్ ను మరో వైపుకు తిప్పుకుని ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వెజ్ ఆమ్లెట్ తయారవుతుంది. దీనిని సైడ్ డిష్ గా తినవచ్చు అలాగే టమాట కిచప్ తో కలిపి స్నాక్స్ గా కూడా తినవచ్చు.