Veg Paratha : గోధుమపిండితో చేసుకోదగిన వంటకాల్లో పరాటాలు కూడా ఒకటి. పరాటాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. మనం వివిధ రుచుల్లో ఈ పరాటాలను తయారు చేస్తూ ఉంటాం. వాటిలో వెజ్ పరాటాలు కూడా ఒకటి. కూరగాయ ముక్కలు వేసి చేసే ఈ పరాటాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ వెజ్ పరాటాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వెజ్ పరాటా తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమపిండి – రెండున్నర కప్పులు, క్యాలీప్లవర్ ముక్కలు – ఒక కప్పు, తరిగిన క్యారెట్స్ – 2, తరిగిన బంగాళాదుంప – 1, పచ్చి మిరపకాయలు – 2, తరిగిన బీన్స్ – ఒక కప్పు, కారం – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – తగినంత.
వెజ్ పరాటా తయారీ విధానం..
ముందుగా కూరగాయ ముక్కలను కుక్కర్ లో వేసి మెత్తగా ఉడికించాలి. తరువాత వీటిలో ఉండే నీటిని తీసి పక్కకు ఉంచాలి. తరువాత ఈ ముక్కలల్లో ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి వేసి ముక్కలను మెత్తగా చేసుకోవాలి. తరువాత ఇందులోనే గోధుమపిండిని కూరగాయలను ఉడికించిన నీటిని పోసి పిండిని కలుపుకోవాలి. తరువాత ఈ పిండిని తగిన పరిమాణంలో ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో ఉండను తీసుకుంటూ పొడి పిండి చల్లుకుంటూ మందంగా ఉండే చపాతీలా వత్తుకోవాలి. తరువాత ఈ పరాటాను బాగా వేడైన పెనం మీద వేసి కాల్చుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై నూనె లేదా నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలి. ఈ పరాటాలను రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వెజ్ పరాటాలు తయారవుతాయి. ఈ పరాటాలను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఉదయం అల్పాహారంగా తీసుకోవడానికి ఈ పరాటాలు చాలా చక్కగా ఉంటాయి. వీటిని పిల్లలకు ఇవ్వడం వల్ల వారికి మరిన్ని పోషకాలు అందుతాయి.