Vegetable Ragi Idli : ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన ఇడ్లీ ఇది.. రోజూ తిన‌వ‌చ్చు.. ఎలా త‌యారు చేయాలంటే..?

Vegetable Ragi Idli : వెజిటేబుల్ రాగి ఇడ్లీ.. రాగిపిండి, వెజిటేబుల్స్ కలిపి చేసే ఈ ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. ఈ ఇడ్లీలను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. అల్పాహారంగా తీసుకోవ‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. వీటిని పిల్ల‌ల‌కు ఇవ్వ‌డం వ‌ల్ల వారిలో ఎదుగుద‌ల చ‌క్క‌గా ఉంటుంది. అలాగే వీటిని త‌యారు చేయ‌డానికి పిండి రుబ్బే ప‌ని కూడా లేదు. అప్ప‌టిక‌ప్పుడు వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ వెజిటేబుల్ రాగి ఇడ్లీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వెజిటేబుల్ రాగి ఇడ్లీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

రాగిపిండి – ఒక క‌ప్పు, బొంబాయి ర‌వ్వ – ఒక క‌ప్పు, పెరుగు – ఒక క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, వంట‌సోడా – పావు టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన క్యాప్సికం – చిన్న‌ది ఒక‌టి, త‌రిగిన క్యారెట్ – 1, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, నూనె -అర టేబుల్ స్పూన్, ఆవాలు -అర టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన క‌రివేపాకు – ఒక రెమ్మ‌.

Vegetable Ragi Idli recipe in telugu make in this method
Vegetable Ragi Idli

వెజిటేబుల్ రాగి ఇడ్లీ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో రాగిపిండిని తీసుకోవాలి. త‌రువాత ర‌వ్వ, పెరుగు, ఉప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిని అర‌గంట పాటు నాన‌బెట్టాలి. త‌రువాత ఇందులో వంట‌సోడా, క్యాప్సికం ముక్క‌లు, కొత్తిమీర‌, క్యారెట్ తురుము వేసి క‌ల‌పాలి.త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ఆవాలు, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత ఈ తాళింపును పిండిలో వేసి క‌ల‌పాలి. ఇప్పుడు ఇడ్లీ కుక్క‌ర్ లో నీళ్లు పోసి మూత పెట్టి వేడి చేయాలి. నీళ్లు వేడ‌య్యే లోపు ప్లేట్ ల‌ల్లో పిండిని వేసుకోవాలి. త‌రువాత ఈ ప్లేట్ లను కుక్క‌ర్ లో పెట్టి మూత పెట్టాలి.

వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై 15 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. వీటిని బ‌య‌ట‌కు తీసి 5 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ త‌రువాత ఇడ్లీలను తీసి స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వెజిటేబుల్ రాగి ఇడ్లీ త‌యార‌వుతుంది. వీటిని ఏ చ‌ట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా రాగిపిండితో ఇడ్లీల‌ను త‌యారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని పొంద‌వచ్చు.

D

Recent Posts