Vellulli Charu : వెల్లుల్లితో చారు ఇలా చేయ‌వ‌చ్చు.. అన్నంలోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Vellulli Charu : మ‌నం వంట‌ల్లో వెల్లుల్లిని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. వెల్లుల్లిలో ఎన్నో ఔష‌ధ గుణాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. వెల్లుల్లిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. వివిధ ర‌కాల వంట‌కాల్లో వాడ‌డంతో పాటు వెల్లుల్లితో మనం ఎంతో రుచిగా ఉండే చారును త‌యారు చేసుకోవ‌చ్చు. వెల్లుల్లి చారు చాలా రుచిగా ఉంటుంది. ఈ చారును అంద‌రూ లొట్ట‌లేసుకుంటూ తింటారు. అలాగే ఈ చారును ఎవ‌రైనా చాలా తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి చారును ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

వెల్లుల్లి చారు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మిరియాలు – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బ‌లు – 20 నుండి 25, నూనె – ఒక‌టిన్న‌ర టీ స్పూన్, తరిగిన ప‌చ్చిమిర్చి – 2, క‌రివేపాకు – రెండు రెమ్మ‌లు, ట‌మాట ముక్క‌లు – ఒక క‌ప్పు, నాన‌బెట్టిన చింత‌పండు – 50 గ్రా., ప‌సుపు – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నీళ్లు – 800 ఎమ్ ఎల్.

Vellulli Charu recipe in telugu tastes better with rice
Vellulli Charu

తాళింపు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 3, క‌రివేపాకు – రెండు రెమ్మ‌లు, క‌చ్చా ప‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, ఇంగువ – 2 చిటికెలు, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

వెల్లుల్లి చారు త‌యారీ విధానం..

ముందుగా రోట్లో మిరియాలు, జీల‌క‌ర్ర వేసి క‌చ్చా ప‌చ్చ‌గా దంచుకోవాలి. త‌రువాత వెల్లుల్లి రెబ్బ‌లు వేసి దంచాలి. ఇప్పుడు గిన్నెలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత దంచుకున్న వెల్లుల్లి మిశ్ర‌మాన్ని వేసి వేయించాలి. వెల్లుల్లి వేగి రంగు మారిన త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. టమాట ముక్క‌లు మెత్త‌గా అయిన త‌రువాత చింత‌పండు ర‌సం వేసి ఒక పొంగు వ‌చ్చే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత ప‌సుపు, ఉప్పు వేసి ఉడికించాలి. త‌రువాత నీళ్లు పోసి 12 నుండి 15 నిమిషాల పాటు మ‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి.

నూనె వేడ‌య్యాక తాళింపు ప‌దార్థాల‌ను ఒక్కొక్క‌టిగా వేసి వేయించాలి. తాళింపు చ‌క్క‌గా వేగిన త‌రువాత దీనిని ముందుగా సిద్దం చేసుకున్న చారులో వేసి క‌ల‌పాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి చారు త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ చారును తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. జలుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డుతున్న‌ప్పుడు, నోటికి రుచిగా తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా వెల్లుల్లి చారును త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts