Vellulli Karam Borugulu : మనం మరమరాలతో రకరకాల చిరుతిళ్లను తయారు చేసుకుని తింటూ ఉంటాం. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. వీటితో చేసే ఎటువంటి చిరుతిళ్లను తయారు చేసిన కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ మరమరాలలో వెల్లుల్లికారం వేసి మిక్చర్ లా కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసే బొరుగులు చాలా రుచిగా ఉంటాయి. అందరూ ఇష్టంగా తినేలా వెల్లుల్లి కారం వేసి బొరుగుల మిక్చర్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వెల్లుల్లి కారం బొరుగులు తయారీకి కావల్సిన పదార్థాలు..
మరమరాలు – పావు కిలో, శనగపిండి – ఒకటిన్నర కప్పులు, ఉప్పు – తగినంత, పసుపు – రెండు చిటికెలు, నూనె – ఒక టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 20, కారం – 2 టేబుల్ స్పూన్స్, పల్లీలు – పావు కప్పు, కరివేపాకు – 3 రెబ్బలు.
వెల్లుల్లి కారం బొరుగుల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో శనగపిండి, ఉప్పు, పసుపు, నూనె వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ మురుకుల పిండిలా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మురుకుల గొట్టంలో చిన్న రంధ్రాలు ఉన్న బిళ్లను ఉంచి గొట్టానికి నూనె రాయాలి. తరువాత అందులో పిండిని ఉంచి కళాయిలో కారపూస వత్తుకోవాలి. దీనిని రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు రోట్లో వెల్లుల్లి రెబ్బలు, కారం వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. తరువాత కళాయిలో మురమరాలను కొద్ది కొద్దిగా వేస్తూ చిన్న మంటపై కరకరలాడే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో పావు కప్పు నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పల్లీలు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే నూనెలో కరివేపాకు వేసి వేయించాలి.
కరివేపాకు వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి దంచుకున్న వెల్లుల్లి కారం వేసి కలపాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరువాత వేయించిన మరమరాలు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత పల్లీలు, కారపూసను ముక్కలుగా చేసి వేసుకుని అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి కారం బొరుగులు తయారవుతాయి. వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల వారం రోజుల పాటు తాజాగా ఉంటాయి. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. వెల్లుల్లి కారం వేసి చేసే ఈ బొరుగులను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.