Buttermilk : మనలో చాలా మందికి నిద్రలేవగానే పరగడుపున నీటిని తాగే అలవాటు ఉంది. పరగడుపున నీటిని తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందన్ని విషయం మనకు తెలిసిందే. మంచి నీటికి బదులుగా ఉదయం పరగడుపున ఒక గ్లాస్ మజ్జిగను తాగితే మన ఆరోగ్యానికి మరింత మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా మజ్జిగను తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చని వారు చెబుతున్నారు. పరగడుపున మజ్జిగను తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మజ్జిగలో ప్రొబయోటిక్ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. పరగడుపున దీనిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ముఖ్యంగా కడుపులో మంట, అల్సర్, గ్యాస్, ఎసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలను తగ్గించడంలో మజ్జిగ మనకు ఎంతో సహాయపడుతుంది.
అలాగే ఉదయం పూట మజ్జిగను తాగడం వల్ల జీర్ణాశయం, ప్రేగులు శుభ్రపడతాయి. ప్రేగుల్లో ఉన్న హానికారక బ్యాక్టీరియాను తొలగించడంలో మజ్జిగ దోహదపడుతుంది. అదే విధంగా రాత్రి మిగిలిన అన్నంలో ఉప్పు, మజ్జిగ పోసి కలపాలి. ఈ అన్నాన్ని ఉదయాన్నే తినాలి. ఇలా తినడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండడానికి తగినంత శక్తి లభిస్తుంది. ఇలా తీసుకోవడం వల్ల శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. శరీరంలో జీవక్రియల రేటు పెరుగుతుంది. ఈ మజ్జిగలో కరివేపాకు, మిరియాల పొడి కలిపి తాగితే మరింత మేలు కలుగుతుంది. ఈ విధంగా తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. విరోచనాలతో బాధపడే వారు మజ్జిగలో అర టీ స్పూన్ అల్లం రసం కలిపి తాగితే విరోచనాలు తగ్గుతాయి.
మజ్జిగను రోజూ తాగడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. శరీరంలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలు తొలగిపోతాయి. రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. శరీరం డీ హైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. మజ్జిగను తాగడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. తియ్యటి పెరుగుతో చేసిన మజ్జిగ చాలా రుచిగా ఉంటుంది. మజ్జిగ మరీ పలుచగా, మరీ చిక్కగా కాకుండా ఉండేలా చూసుకోవాలి. మజ్జిగను రోజూ రెండు పూటలా గ్లాస్ మోతాదులో తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.