Vellulli Karam Podi : మనం వంటింట్లో వివిధ రకాల కారం పొడులను కూడా తయారు చేస్తూ ఉంటాము. వంటల్లో, అల్పాహారాల్లో వీటిని వాడుతూ ఉంటాము. కారం పొడులను చాలా సులభంగా, చాలా తక్కువ సమయంలో ఎవరైనా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇలా మనం సులభంగా చేసుకోదగిన రుచికరమైన కారం పొడులల్లో వెల్లుల్లి కారం పొడి కూడా ఒకటి. వెల్లుల్లి రెబ్బలు వేసి చేసే ఈ కారం పొడి చాలా రుచిగా ఉంటుంది. అన్నం, వేపుళ్లు, అల్పాహారాల్లోకి ఈ కారం పొడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎవరైనా చాలా తేలికగా 15 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ వెల్లుల్లి కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వెల్లుల్లి కారం పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, మినపప్పు – 2 టేబుల్ స్పూన్స్, ధనియాలు – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – అర టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 15 నుండి 20, కరివేపాకు – 4 రెమ్మలు, వెల్లుల్లిపాయ – 1, ఉప్పు – తగినంత.
వెల్లుల్లి కారం పొడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత మినపప్పు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత ధనియాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఇవన్నీ వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలను పొట్టుతో వేసి కలిపి ప్లేట్ లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే ఉప్పు కూడా వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలా మిక్సీ పట్టుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఈ పొడి చల్లారిన తరువాత డబ్బాలో వేసి నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి కారం పొడి తయారవుతుంది. ఇలా తయారు చేసిన ఈ పొడి 20 రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఈ కారం పొడిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.