Taati Munjalu : వేసవి కాలంలో మనకు లభించే అనేక రకాల పండ్లలో తాటి ముంజలు ఒకటి. వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఈ సీజన్‌లో ఇవి మనకు అధికంగా లభిస్తాయి. ఇవి మనకు చలువ చేస్తాయి. కనుక సీజనల్‌గా లభించే వీటిని తప్పకుండా తరచూ తినాలి. ఇక వీటిని తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. తాటి ముంజలను తినడం వల్ల మనకు అనేక విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి. ముఖ్యంగా వీటిల్లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. కళ్ల సమస్యలను తగ్గిస్తుంది. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
తాటి ముంజల్లో బి కాంప్లెక్స్ విటమిన్లు కూడా అధికంగానే ఉంటాయి. ఇవి పోషకాహార లోపాన్ని తగ్గిస్తాయి. వ్యాధులు రాకుండా చూస్తాయి. ఎర్ర రక్త కణాలు పెరిగేలా చేస్తాయి. దీంతో రక్తహీనత తగ్గుతుంది. అలాగే ముంజల్లో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. వీటిలో ఉండే జింక్ పురుషుల సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా వీర్యం అధికంగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి.
వేసవిలో మన శరీరం సహజంగానే వేడిగా మారుతుంది. కానీ తాటి ముంజలను తింటే శరీరం చల్లబడుతుంది. వేడి మొత్తం పోతుంది. డీహైడ్రేషన్ బారిన పడకుండాఉంటారు. ఎండదెబ్బ నుంచి సురక్షితంగా ఉండవచ్చు. అధిక బరువును తగ్గించడంలోనూ తాటి ముంజలు సహాయ పడతాయి. వీటిలో 90 శాతం నీరే ఉంటుంది. కనుక ఇవి బరువు తగ్గేందుకు సహాయ పడతాయి. వికారం, వాంతులు.. వంటి సమస్యలు ఉన్నవారు తాటి ముంజలను తింటే వెంటనే ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
గర్భంతో ఉన్నవారు తాటి ముంజలను తింటే ఎంతో మేలు జరుగుతుంది. ఇవి గర్భిణీల్లో జీర్ణశక్తిని మెరుగు పరుస్తాయి. దీంతో పోషకాలు సరిగ్గా అందుతాయి. అలాగే కడుపులో మంట, వికారం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరిచే గుణాలు తాటి ముంజల్లో ఉంటాయి. కనుక వీటిని తింటే గ్యాస్, మలబద్దకం, అసిడిటీ వంటి సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. తాటి ముంజలను తినడం వల్ల లివర్ పనితీరు మెరుగు పడుతుంది. లివర్‌లోని వ్యర్థాలు బయటకుపోతాయి. లివర్ శుభ్రంగా మారుతుంది. ఇలా వీటితో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కనుక ఈ సీజన్‌లో వీటిని తప్పక తినాలి.